పవన్ కల్యాణ్ జనసేన పదో ఏట అడుగుపెట్టేసింది. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం మచిలీపట్నంలో భారీ ఎత్తున ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు పవన్. జనసేన ప్రస్థానం, నాయకుడిగా పవన్ తీరు, రాజకీయాలకు బయట పవన్‌కు ఉన్న బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్, సొంత సామాజికవర్గం కాపుల రూపంలో ఉన్న కోట్లాది ఓట్ బ్యాంక్ వంటివన్నీ చూసినప్పుడు జనసేన పార్టీ రేంజ్‌కు ఇప్పుడున్న పరిస్థితికి ఏమాత్రం మ్యాచ్ కావడం లేదని అర్థమవుతుంది ఎవరికైనా. మరి ఎందుకీ దుస్థితి..? రెండు ఎన్నికల్లో పోటీ చేసినా పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారెందుకు? పవన్ కల్యాణ్ అసలు ఎన్నికల్లో గెలవలేకపోతున్నారెందుకు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఆయన సాధారణ అభిమానుల వరకు అందరినీ వేధిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు కారణాలు ఎన్ని చెప్పుకొన్నా అసలైన కారణం ఒక్కటే… జనసేనలో ఔత్సాహికులు ఎక్కువ, అనుభవజ్ఞులు తక్కువ.
అవును… జనసేన పుట్టుక నుంచి నేటి వరకు ఆ పార్టీ ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే స్పష్టంగా కనిపిస్తున్న లోపం ఇదే. ఎన్నికల రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న నాయకులు, ఊరమాస్ లీడర్లు, రాత్రికి రాత్రి రాజకీయాన్ని తిప్పేయగలిగే ఎన్నికల వ్యూహాలు పన్నిన నేపథ్యం ఉన్నవాళ్లు పార్టీలో లేరు. పవన్ స్వయంగా ఊరమాస్ యాక్టర్ అయినప్పటికీ రాజకీయాలకు వచ్చేటప్పటికి మాత్రం మాటల వరకే అగ్రెసివ్.
పవన్ జనసేనలో ఉన్నవారిలో ఎన్నికల రాజకీయాల్లో కాకలు తీరిన వారు లేరు. పవన్ తరువాత స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నా ఆయన పనిచేసింది స్పీకరుగా. దాంతో ఆయన కూడా వయసు తక్కువైనా పెద్దతరహా రాజకీయాలకే పరిమితం అన్నట్లుగా ఉన్నారు. మిగతావారిలో చెప్పుకోదగ్గ ఫేసే లేదు. వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగిన కొందరు కాపులు, మత్స్యకారులు, ఇతర బీసీ వర్గాలు, మాజీ అధికారులు.. ఇలా చాలామంది జనసేన సిద్ధాంతాలు నచ్చి పవన్‌తో కలిసి నడుస్తున్నారు. వారంతా వారివారి రంగాల్లో పేరున్నవారు, సత్తా ఉన్నవారే అయినా ఎన్నికల రాజకీయాలకు వచ్చేసరికి తేలిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితులలో పవన్‌కు కావాల్సింది ఎన్నికల రాజకీయాలలో అనుభవం ఉన్నవారు. నియోజకవర్గాల స్థాయిలో మంచి పట్టున్న నేతలు. అప్పుడే ఎన్నికలలో జనసేన విజయం సాధించగలుగుతుంది. నీతిమంతులు కారు, సంస్కారవంతులు కారు వంటి శషభిషలు వదిలిపెట్టి ఇతర పార్టీల నుంచి నేతలను లాక్కుంటేనే జనసేన అసెంబ్లీలో కనిపిస్తుంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నారనో.. అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం కాలం నుంచే పరిచయం ఉందనో.. అధికారులుగా విశేష సేవలు అందించారనే.. పుస్తకాలు బాగా చదువుతారనో తనకు నచ్చిన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చుకుంటూ పోతే జనసేన ఎన్ని ఆవిర్భావ సభలు నిర్వహించినా అధికారంలోకి మాత్రం రాలేదు.
ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన అనుభవం ఉన్న పార్టీల తరహాలో డబ్బులు ఖర్చుపెట్టే నాయకులు, కులబలం ఉన్న నాయకులు, నిత్యం ప్రజల్లో ఉండే నాయకులు, రాత్రికి రాత్రి నియోజకవర్గమంతా తన చేతుల్లోకి తీసుకునే నాయకులు, బరిలో దిగితే ప్రత్యర్థులు బలాదూరే అనేటంతటి నాయకులను నియోజకవర్గాలలో గుర్తించి పార్టీలోకి తెస్తేనే జనసేన మనుగడ సాధించగలుగుతుంది. ఇప్పుడున్న ఔత్సాహికులను వదిలిపెట్టకుండా పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పగించి వారిని భవిష్యత్ నేతలుగా తయారుచేసుకోవాలి.
మరి ఎన్నికల రాజకీయాలకు పనికొచ్చే అనుభవజ్ఞులైన నాయకులు జనసేనకు రావాలంటే వారికి కావాల్సింది నమ్మకం, హామీ, భరోసా. పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం, వస్తే తమకు మంత్రి పదవులో ఇతర ముఖ్యమైన పదవులో దక్కుతాయన్న హామీ, దక్కితే తాము అధికారం వెలగబెట్టొచ్చన్న భరోసా కావాలి. దేశంలో ప్రభుత్వాలు ఏర్పాటుచేసే ఏ పార్టీలోనైనా జరిగేది ఇదే. జనసేన కూడా ఇప్పుడు అదే చేయాలి. అదే చేస్తే పవన్ చెప్తున్నట్లు ఆయన సొంత జేబులోంచి డబ్బులు తీయనక్కర్లేదు.. పార్టీలోకి వచ్చేవారే డబ్బులు ఖర్చు పెట్టి తాము గెలిచి, తమవారిని గెలిపించుకుంటారు. పవన్ ఈ ఫార్ములాను నమ్మితే మిగతా ఈక్వేషన్లు అన్నీ పనిచేస్తాయి, బలాలన్నీ ఫలాలనిస్తాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates