ఎందుకింక ఎన్నిక‌లు.. వైసీపీపై నెటిజ‌న్ల ఫైర్‌

ఏపీలో తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రించిన తీరుపైస‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా నెటిజ‌న్లు ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌లు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డార‌ని.. వ‌చ్చిన వార్త‌ల‌పై తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్ర‌ధానంగా తిరుప‌తి, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ జ‌రిగిన తీరు, చివ‌రి రెండు గంట‌ల్లో వైసీపీ నేత‌లు.. విజృంభించిన తీరు పై అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. నేత‌లు దౌర్జ‌న్యానికి దిగార‌ని.. దొంగ ఓట్లు వేసుకున్నార‌ని.. ప్ర‌ధాన మీడియాల్లో వార్త‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా ఏమా త్రం అర్హ‌త లేని మ‌హిళ‌ల‌ను కూడా ఓటుకు పంపిన వైనం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది.

ఆయా వ్య‌వ‌హారాల‌పై నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇంకెందుకు.. పోలింగ్ దండ‌గ‌.. మీరే గుద్దేసుకునేదానికి! అని తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తిరుప‌తిలో పోలింగ్ బూత్ 229లో వైసీపీ నేతలు కెమెరాలు ఆపివేసి దౌర్జన్యంగా ఓట్లేసుకున్నారని వ‌చ్చిన వార్త‌ల‌పై నెటిజ‌న్లు తీవ్రంగా స్పందించారు. అదేవిధంగా బీజేపీ సీపీఐ, సీపీఎం, టీడీపీ అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఏపీఓపై దౌర్జన్యం జరిగిన పాఠశాల పోలింగ్ బూత్ ఎదుట నిరసనకు దిగారు. అఖిలపక్షాల ఆందోళనకు పోటీగా వైసీపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో తిరుప‌తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇక‌, నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలింగ్స్టేషన్ దగ్గర కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాల్లో యధేచ్చగా వైసీపీ నేతల సంచారించారు. సమాచారం అందుకున్న.. టీడీపీ నేత బుడ్డా రాజశేఖరరెడ్డి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గందరగోళంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా నందికొట్కూరులో టీడీపీ నేత మండ్ర శివానందరెడ్డి ఓటు వేసేందుకు వచ్చారు. అయితే క్యూలైన్లో నిలబడకుండా ఓటు వేసేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను శివానందరెడ్డి నిలదీశారు. దీంతో శివానందరెడ్డి డౌన్ డౌన్ అంటూ వైసీపీ నేతలు గొడవకు దిగారు. ఎన్నికల కేంద్రం బయట టీడీపీ, వైసీపీ శ్రేణులు గొడవకు దిగాయి. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మొత్తంగా ఈ ప‌రిణామాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.