ఏపీ అధికార పార్టీ వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తన దగ్గర వెయ్యి కోట్లు లేవని..పార్టీని ఏకబిగిన నడపలేనని వ్యాఖ్యానించారు. నేతలను కూడా కొనుగోలు చేసే శక్తి తనకు లేదన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వరుసగా రెండో రోజు జరిగిన కాపు సంక్షేమ సేన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనన్నారు. వాస్తవిక ధోరణి ఎలా ఉందో దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తానని చెప్పారు.
జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించబోమని చెప్పారు. ఇతర పార్టీల అజెండా కోసం మేం పనిచేసేది లేదని మరోసారిపవన్ తేల్చి చెప్పారు. “రూ.వెయ్యి కోట్లతో రాజకీయాలు చేయలేం, పార్టీ నడపలేం. భావనాబలం ఉంటేనే పార్టీని నడపగలం. పార్టీని ఇంకా ప్రతికూల పవనాల మధ్యే నడుపుతున్నా. కాపులంతా నాకు ఓటేస్తే గాజువాక, భీమవరంలో గెలిచేవాడిని” అని అన్నారు.
అనేక అవమానాలు పడ్డా!
రాజకీయాల్లోకి రాకముందు.. తాను అందరితోనూ శభాష్ అనిపించుకున్నానని .. కానీ, రాజకీయాల్లోకి వచ్చాక పదేళ్లుగా అనేక మాటలు పడ్డానని పవన్ చెప్పారు. గత ప్రభుత్వంలో రిజర్వేషన్ గురించి మాట్లాడినవారు ఇప్పుడెందుకు మాట్లాడరని పరోక్షంగా ముద్రగడ పద్మనాభాన్ని నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. కాపుల వైపు నిలబడబోమని చెప్పినా ఓటేసి గెలిపించారంటూ.. గతంలో జగన్ జగ్గంపేటలో చేసిన వ్యాఖ్యలను ఆయన చూపించారు.
ఈ ఎన్నికలు కీలకం..
2024 ఎన్నికలు చాలా కీలకం. సంఖ్యాబలాన్ని అనుసరించి మన సత్తా చాటుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. రాజకీయ సాధికారిత కావాలంటే కాపులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ” 2008-09లో జరిగిన ఘటనలు నాలో పంతం పెంచాయి. ఉపాధి, ఉద్యోగాలు కావాలని అడిగే స్థితిలోనే ఇంకా ఉన్నాం. పెద్ద కులాలతో గొడవలు వద్దు.. అన్ని కులాలను సమానంగా చూడాలి. కాపులు కూడా కట్టుబాటు తీసుకోవాలి” అని పవన్ వ్యాఖ్యానించారు.