బంధం బలపడబోతోంది. మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఫుల్లుగా జనసేన వైపుకు వెళ్లబోతున్నట్లుగా పావులు కదులుతున్నారు. ఇంతవరకు కొంచెం శ్రేయోభిలాషిగా, కొంచెం సలహాదారుగా ఉన్న జోగయ్య ఇప్పుడు ఫుల్ టైమ్ జనసేనకే కేటాయించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
పవన్ ను సీఎంగా చూడడమే…
జనసేనాని పవన్ కల్యాణ్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా జోగయ్య సలహాలిస్తున్నారు. డూ ఆర్ డై పరిస్థితులు ఉన్నట్లుగా భావిస్తున్న తరుణంలో జోగయ్య ఎత్తులు పవన్ కు పనికొస్తాయన్న చర్చ జరుగుతోంది. జనసేనకు మద్దతుగా క్షేత్రస్థాయిలో కాపులను కూడగట్టే ప్రక్రియ కూడా జోగయ్య మొదలెట్టేశారు.
పటిష్టంగా కాపు సేన
కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటిపై నిలబెట్టేందుకు జోగయ్య ప్రయత్నిస్తున్నారు. కాపు సంక్షేమ సేనతో జనసేనకు మద్దతు ప్రకటింపజేశారు. ఆ సంస్థకు ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడు కావడం విశేషం. పైగా కాపు సంక్షేమ సేన సభ్యులంతా జనసైనికులేనని జోగయ్య ప్రకటించారు.
12న కీలక భేటీ
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు ఘనగా జరుగుతున్నాయి. ఈ నెల 11 నుంచి 14 వరకు జనసేనాని వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందులో భాగంగా 12న మధ్యాహ్నం 2 గంటలకు చేగొండి హరిరామ జోగయ్యతో కూడా సమావేశం ఉంటుంది. అందులో కాపు సంక్షేమ సేన కీలక ప్రతినిధులు కూడా పాల్గొంటారు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంచలన నిర్ణయం తీసుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. జోగయ్య సమక్షంలోనే ప్రెస్ మీట్ నిర్వహించి ఒక ప్రకటన చేసినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని వార్తలు వస్తున్నాయి…