తెలంగాణలో రెండు భవన్ల మధ్య వివాదం బాగా ముదిరిపోయింది. అందుకనే రాజ్ భవన్ మీద ప్రగతి భవన్ సుప్రీంకోర్టులో కేసువేసింది. రాజ్ భవన్ అంటే గవర్నర్ నివాసమని, ప్రగతి భవన్ అంటే కేసీయార్ నివాసమని అందరికీ తెలిసిందే. వ్యక్తుల హోదాలో కాకుండా గవర్నర్-సీఎం మధ్య వివాదాలు బాగా ముదిరిపోయాయి. దీంతో మధ్యలో ఉన్నతాదికారులు నలిగిపోతున్నారు. ఇపుడు పెండింగ్ బిల్లులను గవర్నర్ క్లియర్ చేయటం లేదని చెప్పి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గవర్నర్ తమిళిసై పై కేసు వేయటమే సంచలనంగా మారింది.
పది బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. బిల్లులపై క్లారిఫికేషన్ అడిగానని దాని కోసమే తాను సంతకాలు చేయకుండా పెండింగ్ పెట్టానని గవర్నర్ చెబుతున్నారు. ఇందులో ఏది కరెక్టో మధ్యలో సుప్రీంకోర్టు ఎలా తేలుస్తుంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వ వాదన అటు రాజ్ భవన వాదన రెండూ కరెక్టే. అన్నింటికన్నా అసలు విషయం ఏమిటంటే తమిళిసై, కేసీయార్ మధ్య ఇగో ప్రాబ్లెమ్స్ బాగా పెరిగిపోయాయి. గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ను కేసీయార్ రద్దుచేసేశారు.
అప్పటినుండే ఇద్దరి మధ్య గొడవలు మొదలై పెరిగిపోయాయి. ఆ మధ్య అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విషయంలో కూడా ఇలాగే గొడవ జరిగింది. అప్పుడు కూడా వివాదం హైకోర్టు మెట్లెక్కింది. దాంతో హైకోర్టుకు ఏమిచేయాలో తోచక ఇద్దరినీ వివాదం సర్దుబాటు చేసుకోమని సలహా ఇచ్చింది. దాంతో కేసీయార్ తగ్గి వివాదం ముగింపుకు చొరవ చూపించారు. దాంతో గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించటంతో అప్పటికి వివాదం ముగిసింది.
మళ్ళీ ఇప్పుడు గవర్నర్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇపుడైనా ఇరుపక్షాలను పిలిపించి సుప్రింకోర్టు విచారిస్తుందనే నమ్మకం లేదు. హైకోర్టు చెప్పినట్లుగానే ఇద్దరి మధ్య సయోధ్యకు అవకాశమిస్తుందనే అనుకుంటున్నారు. లేకపోతే రాజ్యాంగపరమైన చిక్కులు తలెత్తే అవకాశముంది. ఒక మధ్యవర్తిని నియమించి సమస్య పరిష్కారానికి సుప్రింకోర్టు సూచించే అవకాశముంది. ఏ విషయం శుక్రవారం విచారణ సందర్భంగా తేలిపోతుంది. సమస్య వచ్చినపుడు పరిష్కారం చూపటం కాదు అసలు రెండు వ్యవస్ధల మధ్య సమస్యే తలెత్తకుండా చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates