తుమ్మల, దాసోజులకు ఎమ్మెల్సీ?

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయాల్సిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఖరారుచేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకస్థానం సిటింగ్ ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్ రావుకే తిరిగి ఇవ్వనున్నారని.. మిగతా రెండు ఎమ్మెల్సీలలో ఒకటి తుమ్మల నాగేశ్వరరావు, ఇంకోటి దాసోజు శ్రవణ్‌కు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నవీన్ రావు 2019లో ఆ పదవిలోకి వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మైనంపల్లి హనుమంతరావు పోటీ చేసి గెలిచారు.. అయితే, అప్పటికి మైనంపల్లి ఎమ్మెల్సీగా ఉండడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. దాంతో.. మైనంపల్లి ప్లేసులో నవీన్‌రావును తీసుకున్నారు. దీంతో 2019 జూన్‌లో నవీన్ రావు ఎమ్మెల్సీ అయ్యారు. మైనంపల్లి ఖాళీ చేసిన ప్లేస్ కావడంతో ఆయనకు మిగిలిన పదవీకాలమే నవీన్‌కు వర్తిస్తుంది.. అంటే సుమారు మూడున్నర సంవత్సరాలకే నవీన్ పదవీకాలం పూర్తవుతుండడంతో కేసీఆర్ ఆయనకు మరో అవకాశం కల్పిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఇక తుమ్మల విషయానికొస్తే 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి ఆయన ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో పాలేరు నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి అనంతరం బీఆర్ఎస్‌లోకి వచ్చారు. దీంతో అక్కడ తుమ్మల వర్సెస్ కందాలగా రెండు వర్గాలయ్యాయి. ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న తుమ్మలకు కేసీఆర్ ఎమ్మెల్సీ చాన్స్ ఇస్తున్నట్లు చెప్తున్నారు.

ఇక దాసోజ్ శ్రవణ్ విషయానికొస్తే గత ఏడాది కాలంలో మూడు సార్లు పార్టీ మారి చివరికి సొంతగూటికి బీఆర్ఎస్‌లోకి వచ్చారు ఆయన. మునుగోడు ఎన్నికలకు ముందు బూర నర్సయ్యగౌడ్ వంటివారు బీజేపీలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ ఆగమేఘాల మీద స్వామిగౌడ్, దాసోజు వంటివారిని తిరిగి బీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చింది. ఆ సమయంలోనే ఆయన ఎమ్మెల్సీ పదవి హామీ తీసుకుని బీఆర్ఎస్‌లోకి వచ్చారన్న ప్రచారం ఒకటుంది. ఆ ప్రకారమే ఇప్పుడాయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారని చెప్తున్నారు.