జగన్ తొలి కేబినెట్లో ఉన్న కాలంలో కానీ, మంత్రి పదవి ఊడిపోయిన తరువాత కానీ ఎప్పుడైనా సరే పవన్ కల్యాణ్‌ను విమర్శించడంలో పేర్ని నాని ఏమాత్రం తగ్గలేదు. కోట్లాది మంది అభిమానులున్న పవన్ కల్యాణ్‌ను అరేయ్, ఒరేయ్ అంటూ మాట్లాడేవారు పేర్ని నాని. పవన్ కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన్ను కాపులతో విమర్శించాలనే జగన్ వ్యూహంలో పేర్ని పావుగా మారిపోయారు. అయితే, అదే కాపు సామాజికవర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ కానీ, పశ్చిమగోదావరికి చెందిన మరికొందరు కాపు నేతలు కానీ జనసేన అధినేతపై పేర్ని నాని తరహాలో మాటల దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువ. నాని మాత్రం నిత్యం పవన్‌పై రెచ్చిపోతుంటారు. ఇప్పుడు అదే ఆయన కొంప ముంచేలా ఉంది.
పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేన పదో ఆవిర్భావ సభను మచిలీపట్నంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. మార్చి 14న పవన్ మంగళగిరిలో మొదలుపెట్టి మచిలీపట్నానికి తన కొత్త వారాహి వాహనంలో చేరుకుంటారు. ఇప్పటికే ఏపీలో పవన్ ఫీవర్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పవన్ రాజకీయంగా తనదైన ముద్ర చూపిస్తారన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా కాపుల ఓట్లు పవన్‌కు భారీగా పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాంటిది మచిలీపట్నంలో పవన్ తన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించి పేర్ని నాని ఓటమికి బాణం వేస్తే కనుక అది గురితప్పదని భావిస్తున్నారు.
మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర బలమైన నేత. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ బలం మరింత పెంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో రెండు పార్టీల అభ్యర్థిగా కొల్లు కనుక పోటీ చేస్తే పేర్ని నాని ఓటమి ఖాయమని స్థానికులు చెప్తున్నారు.
అయితే, కొల్లు రవీంద్ర మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయొచ్చని.. మచిలీపట్నం అసెంబ్లీ బరిలో జనసేన ఉంటుందన్న లెక్కలూ వినిపిస్తున్నాయి. పవన్ కనుక మచిలీపట్నంపై ఫోకస్ పెడితే పేర్ని నాని ఓటమి ఖాయమని జనంలో టాక్. స్థానికంగా వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరితో విభేదాల నేపథ్యంలో పేర్ని నాని ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పవన్ రూపంలో మరో పిడుగు పడుతున్నట్లవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates