తెలంగాణ మంత్రుల‌కు చంద్ర‌బాబు చుర‌క‌లు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలంగాణ అభివృద్ధిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదేన‌న్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో మౌలిక వసతులు సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత టీడీపీదేన‌ని చెప్పారు. తెలంగాణ‌లో పార్టీని ముందుకు న‌డిపించేందుకు చంద్ర‌బాబు.. తాజాగా ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో టీడీపీ నేత‌లు ఇంటింటికీ తిరుగుతూ.. పార్టీ ప్రాధాన్యాన్ని వివ‌రించ‌నున్నారు.

ఇక‌, ఈ సందర్భంగా చంద్రబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 41 ఏళ్లుగా తెలుగువారి కోసమే టీడీపీ ప‌నిచేస్తోంద‌న్నారు. కేవలం ఏపీలోనే కాకుండా.. తెలంగాణలో ప్రతిఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకు న్నారని చెప్పారు. తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేశారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారని వివ‌రించారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ అని.. టీడీపీ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి బాట ప‌ట్టింద‌ని తెలిపారు.

టీడీపీ ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభే సమాధానమ‌ని.. ప‌రోక్షంగా.. తెలంగాణ‌ మంత్రుల‌కు మ‌రోసారి చంద్ర‌బాబు చుర‌క‌లు అంటించారు. ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తోందన్నారు. తెలంగాణలో మొదటి సీటు నాయిబ్రాహ్మణులకు..రెండో సీటు రజకులకు ఇస్తామ‌న్నారు. తెలంగాణ టీడీపీకి యువత అండగా ఉండాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

విభజన తర్వాత లేనిపోని సమస్యలు పెట్టుకోవటం సరికాదని హిత‌వు ప‌లికారు. తెలంగాణలో సంపద సృష్టించడానికి కారణం టీడీపీనే అని..పేదలను నాయకులుగా ప్రమోట్ చేసిన పార్టీ టీడీపీ మాత్రమేన‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఎన్టీఆర్‌ భవన్ చుట్టూ కాకుండా.. నేతలు గ్రామాల్లో తిరగాలి టీడీపీని కాపాడుకోవ డం చారిత్రక అవసరం అని చంద్రబాబు అన్నారు.