రాజకీయాల్లో సింపతీకి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నాయకులు ఎవరైనా సింపతీకి వ్యతిరేకం కాదు.. అసలు సింపతీ కోసం.. ప్రజలను తమ వైపు తిప్పుకొనేందుకు రాజకీయ నేతలు చేసే ఫీట్లు కూడా అన్నీ ఇన్నీ కావు. గత ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు. అనేక హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకే.. అందుకే ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో 151 మంది ఎమ్మెల్యేలు అందివచ్చారు.
అదేసమయంలో జగన్‌కు గత ఎన్నికల్లో కలిసి వచ్చిన మరో కీలక అంశం.. సొంత బాబాయి.. వివేకానంద రెడ్డి హత్య. ఈ కేసును అప్పటి ఎన్నికలకు ముందు జగన్ అనుకూల మీడియా ఎన్ని మలుపులు తిప్పా లో అన్ని మలుపులూ తిప్పేసింది. నారా సుర రక్త చరిత్ర అంటూ తాటికాయంత అక్షరాలతో అచ్చోసింది . అసలు ఏం జరిగిందో బయట ప్రపంచానికి తెలిసే లోగానే.. ఇదంతా కూడా టీడీపీనే చేయించిందనే ప్రచారం ప్రారంభించారు వైసీపీ నాయకులు.
ఫలితంగా వైసీపీవైపు అంతో ఇంతో సానుభూతి పవనాలు వచ్చాయి. అయితే..ఇప్పుడు మరోసారి ఈ కేసులు తీవ్రత పెరిగింది. అటుసీబీఐ దూకుడు పెంచడం.. ఈ మూడున్నరేళ్లలో సొంత బాబాయి కేసు విషయంలో సీఎం జగన్ ఆయన ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. వివేకా కుమార్తె సునీత చేసిన న్యాయ పోరాటం వంటివి.. ప్రజల మధ్య చర్చకు వస్తున్నాయి. పైగా.. ఇప్పుడు అన్ని వేళ్లు కూడా.. అవినాష్ చుట్టూ తిరుగుతుండడంతో మరోసారి ప్రజల దృష్టి ఈ కేసును ఆకర్షించింది.
ఇది కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు ముందే కావడం గమనార్హం. తాజా పరిణామాలను గమనిస్తే.. మరో ఏడాదిలో ఈ కేసు ఎక్కడా ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఉండే.. ఖచ్చితంగా పుంజుకుంటుంద ని అంటున్నారు పరిశీలకులు. ఇదే జరిగితే.. వివేకా కేసులో నాడు సింపతీని పొంది.. ఓట్లు రాబట్టుకున్న వైసీపీకి.. వచ్చే ఎన్నికల్లో ఈ సింపతీ పోయి.. ఓట్లు కరిగిపోయే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు పరిశీలకులు. అన్ని వేళలా.. రాజకీయ ఎత్తుగడలు ఫలించే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates