‘ఆమెకు అప్పులున్నాయి సర్.. టికెట్ నాకే ఇవ్వండి’

టీడీపీలో ఆళ్లగడ్డ అసెంబ్లీ టికెట్‌కు తీవ్రమైన పోటీ ఉంది. భూమా అఖిలప్రియ మరోసారి ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తుండగా ఏవీ సుబ్బారెడ్డి కూడా ఇక్కడి నుంచే టికెట్ కోరుతున్నారు. అఖిల తండ్రి నాగిరెడ్డి ఉన్న కాలంలో ఆ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న సుబ్బారెడ్డికి.. నాగిరెడ్డి మరణం తరువాత ఆ కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. అంతేకాదు.. అఖిల ప్రియ, సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. తనను చంపేందుకు అఖిల ప్రియ, ఆమె భర్త కుట్ర పన్నారంటూ సుబ్బారెడ్డి గతంలో కేసు పెట్టారు కూడా. ఇప్పుడు ఆళ్లగడ్డలో తన ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సుబ్బారెడ్డి గట్టిగా కోరుకుంటూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన అఖిలకు టికెట్ రాకుండా అన్ని ఎత్తుగడలు వేస్తున్నట్లు చెప్తున్నారు. ఆళ్లగడ్డలో 30 ఏళ్లుగా తనకు పట్టుందని.. గ్రామగ్రామన తనకు అనుచరులు ఉన్నారని.. అఖిల క్యాడర్‌తో అస్సలు టచ్‌లో లేరని అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. అంతేకాదు.. అఖిల పూర్తిగా అప్పుల్లో ఉన్నారని.. ఎన్నికల్లో నిలబడడానికి కావాల్సిన డబ్బు కూడా ఆమె దగ్గర లేదని సుబ్బారెడ్డి టీడీపీ పెద్దలకు చెప్పినట్లుగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని.. అందుకే తనకు టికెట్ ఇవ్వాలని సుబ్బారెడ్డి కోరారట.

అంతేకాదు.. తనకు ఆళ్లగడ్డ టికెట్ , తన కుమార్తెకు నంద్యాల టికెట్ ఇవ్వాలని టీడీపీ పెద్దలను సుబ్బారెడ్డి కోరినట్లు తెలుస్తోంది. టికెట్ తనకే వస్తుందని, వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై తాను పోటీ చేయడం ఖాయమని సుబ్బారెడ్డి ఇప్పటికే స్థానికంగా చెప్తున్నారని అంటున్నారు.

అయితే, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మరో పేరు కూడా వినిపిస్తోంది. అఖిల పెదనాన్న కుమారుడు భూమా కిశోర్ రెడ్డి కూడా టీడీపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కిశోర్ రెడ్డి బీజేపీ ఇంచార్జిగా ఉన్నారు. టికెట్ కన్ఫర్మయితే టీడీపీలోకి వచ్చి పోటీ చేయాలని భావిస్తున్నారట.