కాపు ఓటు బ్యాంకుఎటు వైపు? రాష్ట్రంలో 25 శాతంగా ఉన్న కాపులకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? ఎవరు ప్రాధాన్యం ఇస్తున్నారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా రెండు రోజుల కిందట ఉమ్మడి తూర్పు గోదావరిలో జరిగిన కాపు నాడు సమావేశంలో ఎటు వైపు మొగ్గు చూపాలనే విషయంపై కాపులు దృష్టి పెట్టారు. ఇదిలావుంటే.. వైసీపీ, టీడీపీలు కూడా కాపులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణకు ఎనలేని ప్రాదాన్యం ఇస్తున్నారు. నిజానికి టీడీపీలో కొందరు కీలక నేతలు వ్యతిరేకిస్తున్నా.. కన్నాను పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు. ఇది కాపులను తమవైపు తిప్పుతుందని ఆయన భావిస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ.. జగన్ కూడా కాపులను మచ్చిక చేసుకునేందుకు ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన కాపులు.. క్షత్రియులకు ఎమ్మెల్సీ కోటాలను రిజర్వ్ చేసినట్టు చెబుతున్నారు.
రెండు సామాజిక వర్గాలకు రెండేసి చొప్పున ఎమ్మెల్సీ సీట్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తద్వారా.. కాపులను, మరో కీలక సామాజిక వర్గం క్షత్రియులను కూడా తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయినప్పటికీ… కాపులు మాత్రం శాంతించే ప్రయత్నం కనిపించడం లేదు. కన్నాతో టీడీపీలో జోష్ పెరుగుతుందని భావించినా.. కాపులు దీనిపై మౌనంగా ఉండడం గమనార్హం.
కాపులు వస్తారు.. కన్నాను బలపరుస్తారనే వ్యూహం చంద్రబాబు కు ఉన్నప్పటికీ.. ఈ తరహా ప్రయత్నాలు అయితే.. పార్టీలో కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై కాపులు.. పార్టీల్లోనూ కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉంది కనుక.. ఆదిశగా వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కానీ, ఏమేరకు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంటుంది.