ఎట్టకేలకు మర్రి రాజశేఖర్ కోరిక తీరింది. ఆయన ఎమ్మెల్సీ అవుతున్నారు. తాజాగా ప్రకటించిన వైసీపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉంది. జగన్ కు కలిసి రాజశేఖర్ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు..
ఎప్పుడో చెప్పి ఇప్పుడు ఇచ్చి…
నిజానికి మర్రి రాజశేఖర్ , జగన్ కు వీరాభిమాని. ఎప్పుడు చూసినా ఆయన జగన్ నామ స్మరణే చేసేవారు. 2019 ఎన్నికల ముందు జగన్ ఆయనకు చిలకలూరిపేట టికెట్ ఇవ్వలేకపోయారు. త్వరలోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంటానని జగన్ అప్పట్లో ప్రకటించారు. చిలకలూరిపేట టికెట్ విడదల రజనీకి ఇవ్వడం తర్వాత ఆమె మంత్రి కావడం జరిగిపోయింది.
జగన్ అధికారానికి వచ్చిన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన రాజశేఖర్ కు మాత్రం టికెట్ ఇవ్వలేదు అందుకు కారణాలు తెలియరాలేదు. అయితే సామాజిక వర్గం లెక్కలు, రాజకీయ సమీకరణాల్లో మర్రి రాజశేఖర్ కు టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నందునే ఎమ్మెల్సీ కూడా ప్రకటించలేదని చెప్పుకున్నారు..
మర్రి వర్గంలో అసహనం
జగన్ చేస్తున్న జాప్యంతో మర్రి వర్గంలో కొంత అసహనం పెరిగిన మాట వాస్తవం. రాజశేఖర్ మౌనంగా ఉన్నప్పటికీ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని పలువురు అనుచరులు బహిరంగంగానే సలహా ఇచ్చారు. పార్టీ మారితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పారు..
మంత్రి పదవి ఇస్తారా..
మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తారన్నది జగన్ అప్పట్లో ఇచ్చిన హామీ. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారన్నది ఒక వాదన. అయితే మంత్రి పదవి ఇవ్వడం అంత సులభమా అంటే మాత్రం అవునని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే చిలకలూరిపేటలోనే విడదల రజనీ ఉన్నారు. ఆమెను తొలగించి మర్రికి మినిష్ట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం ఒక అవకాశం రావచ్చని చెబుతున్నారు. ఎందుకంటే జగన్ కేబినెట్లో ఇప్పుడు కమ్మ వర్గానికి ఒక నాయకుడు కూడా లేరు. అయితే అందులోనూ ఒక ఇబ్బంది ఉంది. మర్రి రాజశేఖర్ మృదుస్వభావి. ఎవరినీ ఏమీ అనే రకం కాదు. జగన్ కు కొడాలి నాని లాంటి ఫైర్ బ్రాండ్లు కావాలి. మరి ఏం చేస్తారో చూడాలి….