బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కౌశిక్ రెడ్డిని విచారణకు రావాలని ఆదేశించింది. దిల్లీలోని జాతీయ కమిషన్ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని.. ఫిబ్రవరి 21న వచ్చి స్వయంగా వివరణ ఇవ్వాలని చెప్పింది. విచారణకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.
తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనవరి 25న ఆయన జమ్మికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గవర్నరును ఉద్దేశించి అనరాని మాటలు అన్నారు. దీనిపై అప్పుడే తీవ్ర విమర్శలొచ్చాయి. బీజేపీ నేతలు కొందరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
అయితే, మహిళా కమిషన్‌కు దీనిపై ఫిర్యాదు అందనప్పటికీ.. గవర్నరు వంటి రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థానంలో ఉన్న మహిళపైనే పరుష వ్యాఖ్యలు చేసిన ఘటనను సుమోటోగా విచారణకు తీసుకుంది.
కాగా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సందర్భంలోనూ ఆ ఫైల్ చాలాకాలంపాటు గవర్నరు వద్ద పెండింగులో ఉంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్కు రాజీనామా చేయడంతో అనివార్యమైన ఉప ఎన్నికలో .. బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటపై గెల్లు శ్రీనివాసయాదవ్‌ను పోటీకి నిలిపింది బీఆర్ఎస్. దీంతో అక్కడి ప్రధాన నాయకుడైన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసింది. గవర్నరు కోటాలో నామినేట్ చేయగా గవర్నరు ఆ ఫైల్‌ను చాలాకాలం ఆపేశారు.
ఆ నేపథ్యంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నరుకు మధ్య ఉన్న ఘర్షణ కారణంగానూ కౌశిక్ రెడ్డి గవర్నరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. జాతీయ మహిళా కమిషన్ విచారణకు హాజరు కానట్లయితే ఆయనపై చర్యలు ఉండొచ్చు.