అందరూ అనుకున్న విధంగానే.. రెండు కీలక విషయాల్లో సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. వాస్తవానికి మరోసారి తన కేబినెట్‌ను విస్తరించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ముందస్తుగా ఎన్నికలకు కూడా వెళ్లాలని చూస్తున్నారు. అయితే.. ఈ రెండు విషయాలపైనా కొన్నాళ్లుగా తర్జన భర్జన అయితే సాగుతోంది. ఎటూ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు.
అయితే.. ఇప్పుడు ఎన్నికలకు ముందు.. సీఎం జగన్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారనేది తాడేపల్లి వర్గాల మాట. తాజాగా కీలక నేతలతో రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి కూడా ఈ మంతనాల్లో పాల్గొన్నారని తెలిసింది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడంపై కాకుండా.. ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లాలనేది ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం టీడీపీ దూకుడు పెరిగింది. ఒకవైపు యువగళం పేరుతో నారా లోకేష్.. మరోవైపు ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు కూడా ప్రజల మధ్య ఉంటున్నారు. ఇంకోవైపు వారాహితో పవన్ కూడా ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఈ వేడి ప్రారంభమై.. ప్రజల్లోకి కాక పుట్టించేలోగానే ఎన్నికలకు వెళ్లిపోతే.. ఎంతో మంచిదనేది వైసీపీ అదినేత ప్లాన్‌గా ఉంది. అదేసమయంలో పార్టీలో అసంతృప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించేయాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే మరోసారిమంత్రివర్గాన్ని విస్తరించడం ద్వారా.. ఈ వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తు న్నారట. ఇప్పుడున్న మంత్రుల్లో తప్పా.. తాలూ అని భావిస్తున్న వారిని పక్కన పెట్టి.. బలమైన వారిని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో ప్రధానంగా కొడాలి నాని, తోట త్రిమూర్తులు.. వంటి ఫైర్ బ్రాండ్స్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోందన్నది వైసీపీ వర్గాల మాట. మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే జగన్ నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.