ఫస్ట్ టైమ్: పోలీసులపై తిరుగుబాటు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌వాళ్లు రువ్వారు. అన‌ప‌ర్తిలో త‌న‌కు ఎదురైన ఆంక్ష‌లు.. నిర్బంధాల‌పై ఆయన తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం ఉన్న పోలీసులు గ‌తంలో త‌న ద‌గ్గ‌రే ప‌నిచేశార‌ని.. రాబోయే టీడీపీ ప్ర‌భుత్వంలోనూ త‌మ ద‌గ్గ‌రే ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని.. ఈ విష‌యాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

అన‌ప‌ర్తిలో త‌ను నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స‌భ‌కు పోలీసులు మొదట అనుమతి ఇచ్చార‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ, తర్వాత అనుమతి రద్దు చేశార‌ని, ఇదేం ప‌ద్ధ‌త‌ని ప్ర‌శ్నించారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నామని ప్రకటించారు. ఇంతటితో రౌడీరాజ్యం అంతం చేసేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభ మైందని హెచ్చరించారు. మా కార్యకర్తలు ముందుకు వస్తే పోలీస్ స్టేషన్లు సరిపోవని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

ఎంత మందిపైన కేసులు పెడతారో చూస్తామని అన్నారు. చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దిగాయి. అనపర్తిలో స‌భ ఉంటుంద‌ని.. ముందుగానే ప్ర‌క‌టించ‌డంతో దేవీచౌక్కు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. అయితే.. పోలీసులు బారికేడ్లు పెట్ట‌డంతో వాటిని కూడా తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు.

దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులను తప్పించుకుని పలువురు దేవీచౌక్ సెంటర్కు చేరుకున్నారు. దీంతో అనపర్తిలో దుకాణాలను పోలీసులు మూసి వేయించారు. ఒక రకంగా చెప్పాలంటే.. అన‌ప‌ర్తి ర‌ణ‌రంగాన్నే త‌ల‌పించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.