కేసీఆర్ పీకిందేమిటి: జీవిత రాజశేఖర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై సినీనటి, బీజేపీ నేత జీవిత రాజశేఖర్ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ఒక రౌడీ షీటర్ అంటూ జీవిత ఆగ్రహించారు. కౌశిక్ రెడ్డికి మహిళలన్నా గౌరవం లేదని ఆమె ఆరోపించారు. తమ బంధువుల విషయంలోనూ కౌశిక్ రెడ్డి అనవసరంగా తలదూర్చి ఆ తరువాత సారీ చెప్పాడని జీవిత అన్నారు. గవర్నరు విషయంలోనూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో జీవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె స్థానిక బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడె కౌశిక్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు. పనిలో పనిగా మంత్రి కేటీఆర్‌ను కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు జీవిత. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కౌశిక్ రెడ్డికి అప్పగించాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారామె.

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని.. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ పీకిందేంటో చెప్పాలని ఆమె అన్నారు. తెలంగాణనే ఉద్ధరించని కేసీఆర్ దేశాన్ని బాగుచేస్తానంటూ బయలుదేరారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని జీవిత అన్నారు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ కేసీఆర్ చెప్పుకోవడం నవ్వు తెప్పిస్తోందని.. రైతులకు కేసీఆర్ చేసిందేమీ లేదని ఆమె అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని విమర్శించారు. కేసీఆర్ 9 ఏళ్లు సీఎంగా ఉండి కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలను నేరవేర్చలేకపోయారని అన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తానని మాటలు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని జీవిత విమర్శించారు. కేసీఆర్‌ను అధికారం నుంచి దించేవరకు బీజేపీ పోరు కొనసాగిస్తుందని జీవిత తెలిపారు.