ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఏపీ సీఎం జగన్ ఎత్తులు పారలేదు. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ణప్తిని కేంద్ర హోంశాఖ తోసిపుచ్చింది. డిస్మిస్ చేయాల్సినంత పెద్ద తప్పుఏమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. దీంతో జగన్ సర్కారుకు భారీ షాక్ తగిలినట్టు అయింది. అదేసమయంలో వెంకటేశ్వరరావుకు ఊరట లభించినట్టు అయింది.
అయితే.. ఏబీ వెంకటేశ్వరరావుపై అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోంశాఖ సూచించింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ ఈ మేరకు లేఖ రాసింది. చర్యల్లో భాగంగా వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్లు రద్దు చేసే అవకాశం ఉంది. ఇక, అటు కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ తీసుకునే చర్యలను క్యాట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఏం జరిగింది?
ఏబీ వెంకటేశ్వరరావు గత చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. అయితే.. ఈ సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన కుమారుడుకు చెందిన కంపెనీ భద్రతా పరికరాలను కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఆయనను విధుల నుంచి పక్కన పెట్టారు. దీంతో తనపై ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేసిందంటూ.. ఏబీవీ.. హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలంటూ గతేడాది పిటిషన్ వేశారు.
అయితే ఈ పిటిషన్‌పై విచారణ నుంచి హైకోర్టు జడ్జి తప్పుకొన్నారు. ఈ పిటిషన్‌పై గతంలో మరో న్యాయమూర్తి విచారణ జరపగా.. హైకోర్టులో తాజాగా రోస్టర్ మారడంతో ఈ పిటిషన్ జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు పరిధిలోకి వచ్చింది. పిటిషనర్ తరపు లాయర్.. అత్యవసర విచారణ జరపాలని కోరగా.. తాను విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు జడ్జి ప్రకటించారు. గతేడాది మార్చి 18న ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏబీవీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై ఇంకా తేలకుండానే.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఏబీవీని డిస్మిస్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే.. దీనికి వ్యతిరేకత తెలిపిన కేంద్రం.. ఆయనపై శాఖాపరమైన చర్యలకు అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది. మరి ఏపీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates