ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడుతున్న ఎమ్మెల్సీ మాధవ్ తాను బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఆయనే కాదు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ కూడా అదే మాట చెప్పారు. ఆయన మరో అడుగు ముందుకేసి 2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దిగారని ఆయన కూడా చెప్పారు.
అయితే… జనసేన నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా లేదు. రాష్ట్రంలో అన్ని విషయాలపై స్పందించే పవన్ కల్యాణ్ కానీ, ఆయన తరువాత పార్టీలో నంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కానీ, నాగబాబు కానీ, ఇతర నాయకులు కానీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఎక్కడా మాట్లాడనే లేదు. ఎమ్మెల్సీ మాధవ్ తమ అభ్యర్థి అని చెప్పలేదు.. ఆయనకు ఓటేయమని పట్టభద్రులను కోరలేదు.
కానీ, బీజేపీ నేతలు మాత్రం తమ అభ్యర్థి జనసేన మద్దతుతో బరిలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ లాంటి కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాడాలన్న సునీల్ ధేవదర్. ఏపీని పునర్ నిర్మించడం బీజేపీ, జనసేనకే సాధ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ పార్టీలను ప్రజలు నమ్మరని అన్నారు. ఆ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు ఓట్లు వేయరని తెలిపారు.
ఇదంతా బాగానే ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే తమ అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. విశాఖలోని స్థానిక జనసేన క్యాడర్ కూడా మాధవ్ విషయంలో ఏమీ స్పందించలేదు. కానీ.. బీజేపీ నేతలు మాత్రం ఉమ్మడి అభ్యర్థి అంటూ ఊదరగొడుతున్నారు.