చంద్ర‌బాబును ఐదేళ్లు కాదు.. ప‌దేళ్లు సీఎంను చేయాలి

టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఏపీకి ఐదేళ్లుకాదు.. ప‌దేళ్ల పాటు సీఎంను చేయాల‌ని ఆ పార్టీ యువ నాయ‌కుడు, యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్న మాజీ మంత్రి నారా లోకేష్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రమం మళ్లీ గాడిన పడాలంటే ఇదొక్క‌టే మార్గ‌మ‌ని తేల్చి చెప్పారు. 16వ రోజు యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఎస్‍ఆర్‍ పురం నుంచి ప్రారంభమయ్యింది. పాదయాత్ర ప్రారంభానికి ముందు యాదవ సామాజిక వర్గం, బెంగళూరులో స్ధిరపడిన జీడి నెల్లూరు నియోజకవర్గ వ్యాపారవేత్తలతో లోకేష్‌ సమావేశం నిర్వహించారు.

అనంత‌రం లోకేష్ మాట్లాడుతూ.. పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చెయ్యడం ఆపి, అంబేద్కర్ రాజ్యాంగం అమలు చెయ్యాలని సూచించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా పోలీసులు లోకేష్ మాట్లాడుతున్న హ్యాండ్ మైకును లాగేసుకున్నారు. మైక్ను పోలీసులు లాక్కోవడంతో అక్కడికి ప్రజల్ని నిశబ్దంగా ఉండమని చెప్పిన లోకేష్‌.. మైక్ లేకుండానే మాట్లడారు. టీడీపీ హయంలో వైఎస్, జగన్ పాదయాత్రలని ఏనాడూ అడ్డుకోలేదని గుర్తు చేశారు. తాను టెర్రరిస్టుని కాదని ఎందుకు అడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు.

జగన్‍ లాగా దేశాన్ని దోచుకొని తాను జైలుకి వెళ్ళలేదని దుయ్యబట్టారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పై పోరాడటానికి ప్రజల్లోకి వచ్చానన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నియోజకవర్గం(గంగాధ‌ర నెల్లూరు)లో అభివృద్ది నిల్లు… అవినీతి ఫుల్లు అంటూ లోకేష్‌ ఎద్దేవా చేశారు. తన మైక్ లాక్కోవడానికి వస్తున్న 1000 మంది పోలీసులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అడ్డుకోమంటూ హితవు పలికారు.

గతంలో ఐఎఎస్ లను మాత్రమే జైలుకి తీసుకెళ్ళిన జగన్ … ఇప్పుడు ఐపిఎస్ లను సైతం జైలుకి తీసుకుపోతాడని నారా లోకేష్ విమర్శించారు. మహిళలు, యువత, రైతులకు జగన్ చేసిన అన్యాయాలపై తన పోరాటం ఆగదన్నారు. వైసీపీ వాళ్ళకి అమలు కానీ జీఓ నెం1 తనకే ఎందుకు అమలు అవుతుందన్నారు. జగన్ యాదవ సోదరులకు ఇచ్చిన హామీని అమలు చేశాడా..? కార్పొరేషన్ నిధులను ఇచ్చాడా అని ప్ర‌శ్నించారు.

గ‌త చంద్ర‌బాబు ప్రభుత్వం యాద‌వుల అభ్యున్న‌తి కోసం 300 కోట్లు ఖర్చు చేసిన‌ట్టు లోకేష్ చెప్పారు. జగన్ యవతకు వెన్నుపోటుపొడిచాడని దుయ్య‌బ‌ట్టారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు… ఇచ్చాడా అని ప్ర‌శ్నించారు. జగన్ ఇడుపుల పాయ‌ పంచాయితీని రాష్ట్రంలో చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఈ విధానం మారాలంటే మళ్లీ చంద్ర‌బాబు అధికారంలోకి రావాల‌ని, పది సంవత్సరాలపాటు బాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలోని పరిస్థితులు మారుతాయని లోకేష్ వ్యాఖ్యానించారు.