కేసీఆర్ క‌ల‌ల స‌చివాల‌యానికి బ్రేక్‌.. ముహూర్తం వాయిదా!

తెలంగాణ ముఖ్యమంత్రి.. కేసీఆర్ క‌ల‌ల సచివాల‌యం.. అంబేడ్క‌ర్ సెక్ర‌టేరియెట్‌ను ఈ నెల 17న ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. మంచి ముహూర్తం కూడా కావ‌డంతో..ఆరు నూరైనా.. దీనిని ప్రారంభించి.. జాతికి అంకితం చేయాల‌ని భావించారు. దీనికి సంబంధించి ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. మాజీ ముఖ్యమంత్రుల‌ను కూడా కేసీఆర్ ఆహ్వానించారు. దీనికి పెద్ద హంగామానే సృష్టించారు. దీని ప్రారంభం అనంత‌రం.. సికింద్రాబాద్‌లో భారీ స‌భ కూడా ఏర్పాటు చేశారు.

అయితే..అనూహ్యంగా ఈ ముహూర్తం వాయిదా ప‌డింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావ‌డంతో కేసీఆర్ స‌ర్కారు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నెల 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. సచివాలయ ప్రారంభోత్సవ అంశంపై సీఈసీని సీఎస్‌ శాంతికుమారి సంప్రదించారు.

సీఈసీ నుంచి ఆశాజనక స్పందన రాకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలావుంటే.. కొత్త సచివాల‌యం.. 28 ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా సిద్ధమైంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు కాగా.. 265 అడుగుల ఎత్తున నిర్మించారు. ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణాన్ని 2020 జనవరిలో ప్రభుత్వం చేపట్టింది. 11 అంతస్తుల ఎత్తుతో నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. మ‌య‌స‌భ‌ను త‌ల‌పించే ఏర్పాట్లు కూడా చేశారు.