ఏపీ కేబినెట్ తాజాగా జరిగింది. అయితే.. కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మంత్రులు బయటకు వెళుతున్న వేళ.. ఇద్దరు మంత్రుల్ని ప్రత్యేకంగా తన వద్దకు పిలిపించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా క్లాస్ పీకిన వైనం ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు మంత్రులు తమ శాఖల పనుల కంటే తమ పక్కనున్న నియోజకవర్గాల్లో తలదూర్చి.. అనవసరమైన రచ్చకు తెర తీస్తున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. గ్రౌండ్ రిపోర్టును తన చేతిలో పెట్టుకొని మరీ వారిని తన వద్దకు పిలిపించుకున్నట్లుగా చెబుతున్నారు.
ప్రత్యేకంగా క్లాస్ పీకించుకున్న ఆ ఇద్దరు మంత్రులు ఎవరన్న విషయానికి వస్తే.. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒకరు కోస్తాంధ్రాకు చెందిన మంత్రి కాగా.. మరొకరు రాయలసీమకు చెందిన మహిళా మంత్రిగా చెబుతున్నారు. వీరిద్దరికి ఉన్న ఒక కామన్ పాయింట్ ఏమంటే.. ఇద్దరు తొలిసారి మంత్రులు అయిన వారే. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత.. తన ఛాంబర్ వద్దకు ప్రత్యేకంగా పిలిపించుకున్న జగన్ ఈ ఇద్దరు మంత్రులకు కాస్తంత గట్టిగానే క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు.
ముఖ్యమంత్రి తనకు వచ్చిన ఫిర్యాదులు.. వాటిపై తాను క్రాస్ చెక్ చేయించిన రిపోర్టును ప్రస్తావిస్తూ.. తీరు మార్చుకోవాల్సిందిగా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మీకు మీ శాఖలు ఉండగా.. పక్క నియోజకవర్తాల్లో తల దూర్చాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నతో పాటు.. వారు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండగా.. నాకు అన్నీ తెలుసమ్మా? రిపోర్టులు చేతిలో ఉన్నాయి. వాటిని చూసే మాట్లాడుతున్నానన్న మాట కాస్తంత కటువుగా రావటంతో ఇద్దరు మంత్రులు మిన్నకుండిపోయినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ ఇద్దరు మంత్రులు తమ తీరు మార్చుకుంటామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
తన తీరుతో బ్యానర్ వార్తలుగా మీడియాలో వస్తున్న మంత్రిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన జగన్.. సమస్యలు ఏమైనా ఉంటే మంత్రిగా నేరుగా కలవొచ్చు కదా? వార్తల్లోకి ఎక్కటం అంత సరదానా? అంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామం ఏపీ అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా చూస్తే.. తమకు తోచినట్లుగా వ్యవహరించే నేతలకు చెక్ పెట్టే విషయంలో జగన్ తన తీరు మార్చుకున్నారన్న మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ తరహా క్లాసులు మరిన్ని ఖాయమంటున్నారు.