ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో సర్వేలు గుబులు రేపుతున్నాయ్. పార్టీ పరంగా చేయిస్తున్న సర్వేలు.. ఎమ్మె ల్యేలకు కంటిపై కునుకు లేకుండా చేసున్నాయి. ఈ క్రమంలో ఒకవైపు.. ప్రజల నుంచి వ్యతిరేకత.. మరో వైపు.. పార్టీలో టికెట్ దక్కుతుందో లేదో.. అనే ఆవేదన ఈ రెండింటి మధ్య ఎమ్మెల్యేలు నలిగిపోతున్నార ని అనుకుంటున్నారా? అదేమీ లేదు. చాలా చక్కగా వారు చేయాల్సింది వారు చేసేస్తున్నారు.
నియోజకవర్గంలోని మండలస్థాయిల నుంచి గ్రామీణ స్థాయి వరకు.. కూడా చేతికి అందిన మేరకు ఏది దొరికితే అది.. తమపరం చేసుకుంటున్నారు. కడప నుంచి కర్నూలు వరకు.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. అన్నచందంగా వైసీపీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. అనంతపురంలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడే పుంజుకుంది. దీనిని అడ్డాగా చేసుకుని కొందరు రెచ్చిపోతున్నారని, వాటాలు పొందుతున్నారని… కమీషన్లు కూడా దండుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.
మరోవైపు.. ఎర్రమట్టి, ఇసుక, కంకర, గ్రానైట్ ఇలా.. ఏది అవసరమైతే.. దేనికి మార్కెట్‌లో డిమాండ్ ఉంటే .. దానిని అక్రమ పద్ధతిలో తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు ఇదే విషయంపై తన సొంత నియోజకవర్గం నుంచి గ్రానైట్‌ను పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని.. ఈ అక్రమాలను ఆపాలని కోరారు. ఇలా.. ఒక్క కుప్పంలోనే కాదు.. అన్ని నియోజకవర్గాల్లోనూ చేతికి అందిన కాడికి నాయకులు ఏదో ఒకటి సొంతం చేసుకుంటున్నారు.
సరే.. ఇవన్నీ ఎందుకు అంటే.. రెండు రూపాల్లో వారు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే.. పోటీ చేసేందుకు అయ్యే ఖర్చు నిమిత్తం ఈ సొమ్మును వినియోగించుకోవచ్చు. ఒకవేళ టికెట్ రాకపోతే.. అంతో ఇంతో వెనుకేసుకుని.. ఎంజాయ్ చేయొచ్చు! అనే కాన్సెప్టుతో నాయకులు చెలరేగుతున్నారని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి.. ముందు చూపు మింగుళ్లు
బాగానేఉన్నాయని అంటున్నారు.