లోకేష్‌ను టెన్ష‌న్ పెట్టేస్తోన్న‌ రెండు విష‌యాలు..

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర 15 రోజులకు చేరిం ది. ఇప్ప‌టికీ చిత్తూరు జిల్లాలోనే ఈ యాత్ర సాగుతోంది. ఇది టీడీపీకి ఒక‌ప్పుడు బ‌ల‌మైన జిల్లా. గ‌త ఎన్ని క‌ల్లో కొంత తేడా కొట్టింది. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ పుంజుకునే ప‌రిస్థితికి వ‌చ్చింది. యాత్రకు కూడా ప్ర‌జ‌ల నుంచి జోరుగా మంచి స్పంద‌న ల‌భిస్తోంది. అయితే.. ఇప్పుడు యాత్ర‌లో ఉన్న నారా లోకేష్‌ను రెండు విష‌యాలు కుంగ‌దీస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఒక‌టి.. పార్టీలోనే జ‌రుగుతున్న యాంటీ ప్ర‌చారం. రెండు ఓటు బ్యాంకు. త‌న పాద‌యాత్ర ద్వారా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల‌ని.. నారా లోకేష్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది.. ఉభ‌య కుశ‌లోప‌రి అన్న‌ట్టుగా రేపు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు త‌నకు తాను వేసుకుంటున్న పూల బాట‌. ముఖ్యంగా పార్టీ అధ్య‌క్ష రేసులో మ‌రొక‌రు లేకుండా చేసుకునే ప్ర‌య‌త్నం. రెండు పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం ద్వారా చ‌రిత్ర‌ను సృష్టించాల్సిన అవ‌స‌రం ఉంది.

అయితే.. ప్ర‌స్తుతం చేస్తున్న పాద‌యాత్ర‌లో పాత ముఖాలే క‌నిపిస్తుండ‌డం.. కొత్తగా సీనియ‌ర్లు ఎవ‌రూ కూడా పాద‌యాత్ర కు పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డం నారా లోకేష్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న విష‌యం. నిజానికి ఈ యాత్ర‌లో పెద్ద ఎత్తున సీనియ‌ర్లను కూడా భాగ‌స్వామ్యం చేయాల‌ని.. చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌చారం చేశారు. కానీ.. 15 రోజులు అయినా.. కూడా సీమ‌కు చెందిన కీల‌క నాయ‌కులు ముఖం చాటేస్తున్నారు.

మ‌రి డ‌బ్బులు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని వారు అలా చేస్తున్నారో.. లేక‌.. పాద‌యాత్ర‌ను లైట్ తీసుకుంటున్నారో.. ఇప్పుడు నారా లోకేష్‌కు అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొంది. వ‌చ్చిన వారితోనే ఆయ‌న యాత్ర ను కొన‌సాగిస్తున్నారు. ఇక‌, మ‌రో కీల‌క విష‌యం.. పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌లు వ‌స్తున్నా.. ఎన్నిక‌ల స‌మ‌యానికి వారి మూడ్‌ను ప‌సిగ‌ట్టే ప‌రిస్థితి లేకుండా పోయింది.

వ‌చ్చిన వారంతా త‌మ‌కు ఓటేస్తారా ? అనే సందేహాలు క‌లుగుతున్నాయ‌ట‌. అయితే.. దీనిపై క్లారిటీ రావాలంటే.. మ‌రో 10 నుంచి 15 రోజులు గ‌డ‌వాల్సి ఉంద‌ని భావిస్తున్నారు. అప్ప‌టికి వ్యూహం మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.