ప్రస్తుతం ఏపీలో జంపింగుల కాలం ప్రారంభమైంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో కి నేతలు జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇటీవల వైసీపీ నుంచి తాను టీడీపీలోకి వెళ్తున్నట్టుగా.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. దీనికి విరుగుడుగా.. వైసీపీ కూడా టీడీపీలో ఉన్న కీలక నేతలకు గేలం వేసే పనిని ప్రారంభించింది. ఇలా.. అనుకున్న వెంటనే.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు.. తుని టీడీపీ ఇంచార్జ్ కృష్ణుడు ఉరఫ్ పళ్ల కృష్ణుడుకు వైసీపీ ఆఫర్ ప్రకటించింది.
పార్టీలోకి వస్తే.. కీలక పదవి ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చినట్టు కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే..ఈ విషయంపై సమాచారం తెలిసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. హుటాహుటిన యనమల సోదరులు ఇద్దరినీ తన వద్దకు పిలుచుకుని పంచాయతీ పెట్టారు. వాస్తవానికి 2014, 2019లో తుని టీడీపీ టికెట్‌ను కృష్ణుడుకు ఇచ్చారు. అయితే, ఆయన వరుసగా పరాజయం పాల య్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ వ్యూహం మార్చాలని నిర్ణయించింది.
దీనిలో భాగంగా.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు తుని టికెట్‌ను దాదాపు కన్ఫర్మ్ చేశారు. దీంతో కృష్ణుడు అలక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనకు చెప్పకుండా ఈ విధంగా చేయడంతో తనకు అన్యాయం జరిగిందని అనుచరుల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కృష్ణుడుపై వైసీపీ గేలం వేసింది. పార్టీలో కీలక పదవి ఇస్తామని ఆశ చూపింది. కాగా, చంద్రబాబు వద్ద జరిగిన పంచాయతీలో కృష్ణుడుకు బలమైన హామీ
ఇచ్చారని తెలిసింది. దీంతో వైసీపీ వేసిన వ్యూహానికి చంద్రబాబు ఇలా చెక్ పెట్టారని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు కృష్ణుడు కూడా చంద్రబాబు వ్యూహంతో సంతోషంతో ఉన్నట్టు చెప్పారు.