బోరుగడ్డ అనిల్‌కు ఎంపీ టికెట్?

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొట్టికొట్టి ఈడ్చుకెళ్తానన్న జగన్ అభిమాని.. చంద్రబాబును చంపేస్తానన్న జగన్ అభిమాని.. పవన్ కళ్యాణ్ భార్యను తనకు అప్పగించాలంటూ బరితెగించి మాట్లాడిన జగన్ అభిమాని.. అన్నీ ఒక్కరే.. ఆయనే బోరుగడ్డ అనిల్. ఇదంతా ఇటీవల కథ అయితే.. అంతకుముందు చరిత్ర కూడా మామూలుగా లేదు. తిరుమలలో శ్రీవారి నగలు మాయమయ్యాయంటూ 2018లో రమణ దీక్షితులు ఆరోపణలు చేసినప్పుడు పక్కన ఉన్నదీ బోరుగడ్డ అనిల్.

అనంతపురంలోని ఓ చర్చి ఆస్తుల కోసం రెండు వర్గాల మధ్య వివాదం నెలకొన్నప్పుడు అది సెటిల్ చేయడానికి ఏకంగా జిల్లా ఎస్పీనే బెదిరించడం.. ఆ క్రమంలో తాను ఐఏఎస్ అధికారినని చెప్పుకోవడం.. పోలీసులు విచారణలో అంతా బయటపడి అరెస్టైంది బోరుగడ్డ అనిల్.

జగన్‌పై విశాఖ ఎయిర్పోర్టులో కోడికత్తితో దాడి జరిగిన తరువాత ఆ కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిందీ బోరుగడ్డ అనిల్.
ఏడు క్రిమినల్ కేసులే కాదు రౌడీ షీట్ కూడా ఉంది ఆయనపై. అంతటి ఘన చరిత్ర బోరుగడ్డ అనిల్‌ది.

ఎదురుగా టేబుల్‌పై భారతదేశం జెండా… నాలుగు సింహాల చిహ్నం.. వెనుక గోడపై ఓవైపు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) బొమ్మ.. మరోవైపు జగన్ ఫొటో ఉంటాయి అనిల్ ఆఫీసులో. తాను ఏపీలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే వర్గం) అధ్యక్షుడినని చెప్పుకొనే ఆయన జగన్‌ను, రాజశేఖరరెడ్డిని, సజ్జల రామకృష్నారెడ్డిని ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తానంటుంటారు. తాను వైసీపీ అభిమానినని చెప్పుకొంటుంటారు. మరోవైపు క్రిస్టియన్ సంస్థలనూ నడిపిస్తున్నారు.

జగన్‌కు తాను బంధువు అవుతాననీ.. వైఎస్ వివేకానందరెడ్డికి మేనల్లుడిని అవుతానని, తన పిన్ని జగన్‌కు దగ్గర బంధువని.. ఆ రకంగా తాను జగన్‌కు బావమరిది అవుతానని కూడా చెప్పుకుంటూ తిరిగే బోరుగడ్డ అనిల్ చైనాలో, బ్రిటన్‌లో చదువుకున్నట్లు చెప్తారు. ఆరేడేళ్ల కిందట 2050 మంది దళితులకు స్వైన్ ఫ్లూ మందులు పంపిణీ చేసినట్లుగా చూపించి యునెస్కో నుంచి అవార్డు కూడా తెచ్చుకున్నారన్నదీ ఒకటి వినిపిస్తుంది. ఢిల్లీ వెళ్లి వివిధ రాష్ట్రాలకు చెందిన దళిత ఎంపీలను కలిసి వారితో ఫొటోలు దిగడం, మంత్రులతో ఫొటోలు దిగడం వంటివి చేస్తూ స్థానికంగా వాటిని చూపించి ప్రచారం చేసుకుంటుంటారు అనిల్.

భూసెటిల్మెంట్లు, దందాలు, కబ్జా ఆరోపణలు ఉన్న బోరుగడ్డ అనిల్ ఎలాగైనా ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులు చేపట్టాలని కోరుకుంటున్నారట. తాను ఏం చెప్తే అది చేసే కొంతమందిని వెంటేసుకుని తిరిగే అనిల్ వైసీపీ నుంచి టికెట్ కోసం ట్రై చేస్తున్నారని… గతంలో అమరావతిలో అరటి తోటల దహనం వంటి వ్యవహారాలలో ఉండి జగన్‌కు దగ్గరై ఎంపీ టికెట్ తెచ్చుకున్న నేతలను ఉదాహరణగా చూపుతూ బోరుగడ్డ అనిల్ తన పొలిటికల్ ఆకాంక్షలను బయటపెడుతుంటారట.

మరి… వైసీపీ పెద్దలు ఇలాంటి రౌడీ షీటర్లను దూరం పెడతారో లేదంటో ఆయన అనుకున్నట్లుగా ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటారో చూడాలి.