పలాస జనసేనకు.. శిరీష కౌన్సిల్‌కు?

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఒక్క టెర్మ్‌కే పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకున్నారన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట. అయితే… అక్కడ టీడీపీ నేత గౌతు శిరీష ఆ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నారన్నది టీడీపీ నేతల మాట. రీసెంటుగా పలాసలో పార్టీ పరిస్థితి గురించి టీడీపీ పెద్దలు అంతర్గతంగా అక్కడి కొందరు నేతలతో మాట్లాడినప్పుడు ఇదే అభిప్రాయం వ్యక్తమైందని తెలుస్తోంది. సీనియర్ నేత గౌతు శివాజీ కుమార్తెగా, గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతగా ఆమె అంటే ప్రజల్లో సానుభూతి ఉన్నా దాన్ని ఆమె పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారని చెప్తున్నారు.

అంతేకాదు… మంత్రి సీదిరి అప్పలరాజుపై నియెజకవర్గ ప్రజల్లో, వైసీపీలో కూడా వ్యతిరేకత ఉన్నప్పటికీ అప్పలరాజును ఎదుర్కోవడంలో శిరీష విఫలమవుతున్నారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. అప్పలరాజును ఆమె ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని… నియోజకవర్గంలో క్యాడర్ బలం పుష్కలంగా ఉన్నప్పటికీ ఆమె సమర్థంగా నడిపించలేకపోతున్నారి చెప్తున్నారు.

కాగా వచ్చే ఎన్నికలలో జనసేనతో పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువవడంతో జనసేన ఇంట్రెస్ట్ చూపుతున్న నియోజకవర్గాలతో పాటు టీడీపీ జనసేనకు ఆఫర్ చేయదగ్గ నియోజకవర్గాల గురించి టీడీపీ పెద్దలు పార్టీలో అంతర్గతంగా అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఆ క్రమంలోనే పలాస గురించి కూడా ఆరా తీశారు.

నిజానికి పలాస టీడీపీలో టికెట్ విషయంలో శిరీషకు ఎలాంటి ఆటంకాలు లేవు. అయితే, జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే పలాస నియోజకవర్గాన్ని జనసేన కోరే అవకాశాలున్నాయి. పవన్ కల్యాణ్‌కు మత్స్యకారుల్లో మంచి ఆదరణ ఉండడంతో పాటు పలాసకాశీబుగ్గ జంట పట్టణాలలోనూ జనసేన పుంజుకొంటోంది. స్థానిక జనసేన నేతలు మత్స్యకార ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తూ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పలాస నియోజకవర్గాన్ని కోరొచ్చనేది స్థానికంగా వినిపిస్తోంది.
టీడీపీ అధిష్ఠానం కూడా పలాసను జనసేనకు వదిలిపెట్టేందుకు సిద్ధంగానే ఉందని.. అదే జరిగితే శిరీషను ఎమ్మెల్సీగా పంపించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది.