లోకేష్‌ ‘గ‌ళం’ ఇంకా పెంచాలి

ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు.. టీడీపీ పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు.. వంటివి సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభించి 10 రోజులు గ‌డిచాయి. మొత్తం 120 కిలో మీట‌ర్లు ఆయ‌న పూర్తి చేసుకున్నారు. అనేక మందిని క‌లుసుకున్నారు. వారికి హామీలు కూడా ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఈ ప‌ది రోజుల వ్య‌వ‌హారం పై స‌హ‌జంగానే విశ్లేష‌ణ‌లు వ‌స్తాయి.

దీనిని ప‌రిశీలిస్తే.. మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. యువ‌గళం పాద‌యాత్రేన‌ని అన్నారు. ఇంత‌కు మించి ఆయ‌న ఎలాంటి వివ‌ర‌ణా ఇవ్వ‌లేదు. దీనికి కార‌ణం.. ఆయన ఉద్దేశంలో ఈ పాద‌యాత్ర ద్వారా ఓట్లు కుమ్మ‌రించే వ్యూహాన్ని నారా లోకేష్ అనుస‌రించ‌డం లేద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఈ సంద‌ర్భంగానే గ‌తంలో వైఎస్‌ను, త‌ర్వాత‌.. జ‌గ‌న్‌ను న‌మ్మిన‌ట్టుగా ఇప్పుడు ప‌రిస్థితి లేదన్నారు.

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌తోనే పాద‌యాత్ర‌ల ఎఫెక్ట్ అయిపోయింద‌ని కూడా ఉండ‌వ‌ల్లి తేల్చి చెప్పారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌ను చూసి ఓట్లు వేస్తార‌ని తాను అనుకోవ‌డం లేద‌ని కూడా అన్నారు. ఇదిలావుంటే.. జాతీయ మీడియా ఒక‌టి ప్రాంతీయ ప‌త్రిక‌లో రాసిన వ్యాసంలోనూ.. నారా లోకేష్ పాద‌యాత్రకు జ‌నం వ‌స్తున్నార‌ని.. కానీ, వీరిని ఓట్లుగా మ‌లుచుకునేందుకు ఆయ‌న త‌డ‌బ‌డుతున్నార‌ని చెప్పుకొచ్చారు.

కేవ‌లం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం కాదు… లోతైన స‌మాచారం సేక‌రించే వెసులుబాటు.. ప్ర‌జ‌లు త‌న‌ను విశ్వ‌సించేలా వ్యాఖ్య‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. మ‌రో జాతీయ ప‌త్రిక కూడా అభిప్రాయ ప‌డింది. ఇక‌, ప్రాంతీయ ప‌త్రిక‌ల విష‌యానికి వ‌స్తే.. టీడీపీ అనుకూల ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌ది రోజులు పూర్త‌య్యాక కూడా ఇప్ప‌టి వ‌ర‌కు విశ్లేష‌ణ‌లు రాలేదు. ఇది ఒక వెలితేన‌ని టీడీపీ నేత‌లు అభిప్రాయ‌ ప‌డుతున్నారు. మొత్తానికి చూస్తే.. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌గా మాత్ర‌మే మిగిలిపోతుందా? లేక ఓట్లు తెచ్చే సాధ‌నంగా మారుతుందా? అనేది చూడాలి.