మంత్రి పదవి ఉన్నా, పోయినా బాధను దిగమింగుకుంటూనే జగనన్న కోసం ఎక్కడ ఎవరి ఆరోపణలు తిప్పికొట్టడానికైనా మీడియా సమావేశం పెట్టి మాటల గారడీ చేసే ఏకైక వైసీపీ నేత పేర్ని నాని. తెలివిగా మాట్లాడడంలో, పార్టీని, జగన్‌ను డిఫెన్స్ చేయడంలో ఈయన ఆరితేరిపోయారు.
మూడేళ్లకు మంత్రి పదవి పోయినా కూడా ఆ బాధ దిగమింగుకుంటూనే జగన్ కోసం నిత్యం మీడియా ముందుకొస్తుంటారు. అయితే, జగన్‌ను ఎంతగా వెనకేసుకొస్తున్నా కూడా జగన్ మాత్రం ఆయన్ను వెనకేసుకురావడం లేదట. నియోజకవర్గంలో నిత్యం ఆయనకు తలనొప్పి కలిగించే సొంత పార్టీకే చెందిన నేతను జగన్ బాగా వెనకేసుకొస్తుంటారట.
మచిలీపట్నంలో ఎమ్మెల్యే పేర్ని నానికి, ఎంపీ వల్లభనేని బాలశౌరికి మొదటి నుంచి సయోధ్య లేదు. నియోజకవర్గంలో ఇద్దరు రెండు వర్గాలను నడిపిస్తుంటారు. బాలశౌరి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు పేర్ని నాని ఎంతగా ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోతున్నారట. అందుకు కారణం జగన్ నుంచి ఆయనకు ఫుల్ సపోర్టు ఉండడమేనంటున్నారు పార్టీ నాయకులు.
నిజానికి పేర్ని నాని తరహాలో బాలశౌరి ఎప్పుడూ మీడియా ముందుకు రారు. పార్టీ తరఫున మాట్లాడరు. నానితో పోల్చుకుంటూ అస్సలు యాక్టివ్‌గా కనిపించరు. కానీ, అధిష్ఠానానికి మాత్రం ఎప్పుడూ దగ్గరగా ఉంటారు.
అంతేకాదు.. బాలశౌరికి ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలు కూడా కలిసివస్తున్నాయని.. ఆ పరిచయాల అవసరాలు జగన్‌కు ఉన్నాయని వైసీపీ నాయకులు చెప్తుంటారు. జగన్ ఢిల్లీ పర్యటనల్లోనూ అనేకసార్లు బాలశౌరిని వెంట తీసుకెళ్లడం కనిపిస్తుంది.
జగన్, బాలశౌరి వ్యాపార భాగస్వాములన్న మాట కూడా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే జగన్ ఆయనకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తుంటారని చెప్తుంటారు. ఈ కారణంగానే బాలశౌరి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పైచేయి సాదిస్తున్నారన్న మాట వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates