ఏపీలో పాలనను ముందుకు తీసుకువెళ్లి.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు అందించాల్సిన కీలకమైన అధికార వర్గం ఐఏఎస్‌లు. జిల్లాలకు కలెక్టర్లుగా, వివిధ శాఖలకు ముఖ్య కార్యదర్శులుగా ఉన్న ఐఏఎస్‌లకు ఒకప్పుడు.. చేతినిండా అధికారం.. స్వేచ్ఛ ఉండేవి. అదే సమయంలో ఎంతో గౌరవమూ ఉండేది. కానీ, ఇప్పుడు అటువంటిదేమీ కనిపించడం లేదని.. ఐఏఎస్‌లు కుమిలిపోతున్నారు.
పైగా.. ఏదో ఒక కేసులో హైకోర్టు వారిని పిలిపించడం.. వారికి అక్షింతలు వేయడం షరా మామూలుగా మారి పోయింది. ఎంతో కష్టపడి.. చదివి ఐఏఎస్ కు ఎంపికైన తమకు ఈ దుర్గతి ఏంటి? అని వారు వాపోతున్నా రు. అంతేకాదు.. కోర్టు ఇలా తమపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం.. ఎవరు? అని కూడా వారు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో ఐఏఎస్‌లపై విరుచుకుపడింది.
కోర్టు ధిక్కారణ కేసుల్లో తరుచూ న్యాయస్థానం ఎదుట హాజరవుతున్న ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి హైకోర్టు తీవ్రంగా మండిపడింది. రోజూ మిమ్మల్ని చూడడానికి చికాకేస్తోందంటూ అసహనం వ్యక్తం చేసింది. ఉపాది హామీ పథకం నిధుల విడుదల కేసు విచారణ సందర్భంగా విచారణకు హాజరైన పంచాయతీరాజ్‌శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి గోపాకకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్‌లను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఈ ఇద్దరు అధికారులే సుమారు 70 సార్లు కోర్టు ధిక్కారణ వ్యాజ్యాల్లో న్యాయస్థానం ముందు హాజరయ్యారని గుర్తుచేసింది. దేశంలో మిగిలిన హైకోర్టుల్లో పోలిస్తే.. ఇక్కడే ఎక్కువ సంఖ్యలో ధిక్కారణ వ్యాజ్యాలు నమోదవుతున్నాయని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరువల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పడానికి ఏమాత్రం సంకోశించడం లేదని తేల్చిచెప్పింది.
ఈ పరిణామాలపై ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది తమ తప్పుకాదని.. అంతర్గత సంభాషణల్లో అధికారులు చెప్పుకొంటున్నారు. ప్రభుత్వానికి తాము అన్నీ చెబుతున్నామని.. కానీ, ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వడం లేదని.. దీంతో కోర్టులతో తాము తిట్లు తింటున్నామని.. ఐఏఎస్‌లు వాపోతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుందామని కూడా వారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.