కొత్త సెక్రటేరియట్ లో ఫైర్ యాక్సిడెంట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సౌథంగా అభివర్ణించే కొత్త సచివాలయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ ఎత్తున నిర్మించిన ఈ భవనం.. ఈ నెల 17న ఘనంగా ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇలాంటి వేళ.. అనూహ్యంగా ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

కొత్త సచివాలయంమొదటి అంతస్తులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంతో.. భారీ ఎత్తున పొగలు.. సచివాలయం పైన ఏర్పాటు చేసిన గుమ్మటం వెనుక నుంచి వచ్చాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ కు రియాక్టు అయిన ఫైర్ సిబ్బంది హుటాహుటిన సచివాలయానికి వెళ్లారు. పదకొండు ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

కొత్త సచివాలయం ఓపెనింగ్ నేపథ్యంలో.. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు రాత్రి పగలు అన్న తేడా లేకుండా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వుడ్ వర్కు జరుగుతోంది. ఈ పనులు జరుగుతున్న వేళలోనే మంటలు చెలరేగినట్లుగా చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మంటలకు కారణం ఏమిటన్న విషయాన్ని అధికారులు వెల్లడించాల్సి ఉంది.

మొత్తంగా అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించి.. పెద్ద ఎత్తున ఫైరింజన్లను మొహరించటంతో మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగారు. ప్రారంభోత్సవ కార్యక్రమం దగ్గరకు వస్తున్న వేళలో.. ఈ తరహాలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం కచ్ఛితంగా అపశకునమే అన్న మాట వినిపిస్తోంది. మరి.. అగ్నిప్రమాదం నేపథ్యంలో.. ముందుగా అనుకున్న ముహుర్తానికి సచివాలయాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని చేపడతారా? లేదంటే ఆగుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.