ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టికెట్లు దొరకని అసంతృప్తులు పార్టీలు మారడం మామూలుగా జరిగేది. అటు వాళ్లు ఇటు,ఇటు వాళ్లు అటు మారడం కూడా సాదారణ విషయమే. వచ్చిన వారిలో కొందరి వల్ల పార్టీకి ప్రయోజనం కలిగితే, కాలక్రమేణా కొందరు మోయలేని అదనపు లగేజీగా మారతారు.వీళ్లని చేర్చుకుని తప్పు చేశామన్న ఫీలింగ్ పార్టీ అధినాయకత్వానికి కలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి అదేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి…
35 మంది జంప్ జిలానీలు
ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సీఎం జగన్ వైనాట్ 175 అంటున్నప్పటికీ ప్రస్తుతం పార్టీలో ఉన్న వారిలో చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవరన్న అనుమానంతో ఇప్పుడే వేరు దారు వెదుక్కోవాలనుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో 35 మంది వరకు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. అందులో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వారు ఇప్పటికే బయటపడిపోయారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు. నియోజకవర్గం పరిశీలకుడిపై ఆగ్రహం చెందుతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ అసలు అక్కసు జగన్ పైనేనని భావిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు చిటికేస్తే పరిగెత్తుకుంటూ వెళ్లాలని వాళ్లు బండి స్టార్ట్ చేసి గేరు మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు..
చంద్రబాబు ఆచి తూచి అడుగులు
టీడీపీ ఇప్పుడు లోకేష్ యువగళం పాదయాత్రలో బిజీగా ఉంది. టేకాఫ్ బాగానే ఉన్న ఆనందంలో ఉబ్బితబ్బిబవుతున్నప్పటికీ ఆ టెంపోను 400 రోజులు ఎలా కొనసాగించాలనే అంశంపై దృష్టి పెట్టింది. దానితో వైసీపీలోని అంతర్యుద్ధాన్ని పట్టించుకునే టైమ్ చంద్రబాబుకు లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
వైసీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయట పడాలనుకున్నా వారిని చేర్చుకునేందుకు టీడీపీ సుముఖంగా లేదని వార్తలు వస్తున్నాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇంతకాలం వారంతా టీడీపీని అనరాని మాటలు అన్నారని, వాటికి మీడియాలో విస్తృత ప్రచారం జరిగిందని సైకిల్ పార్టీ గుర్తు చేస్తోంది. పైగా వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది అరాచకాలకు, అవినీతికి, రౌడీయిజానికి పాల్పడిన వారేనని టీడీపీ గుర్తించింది. వారిని చేర్చుకుంటే తమ పార్టీకి చెడ్డపేరు వస్తుందని, ఎన్నికల ప్రచారంలో సమాధానం చెప్పుకోలేని దుస్థితి దాపురిస్తుందన్న ఫీలింగ్ ఉంది. పైగా చంద్రబాబునే బూతులు తిట్టినవారు కొందరున్నారు.
కోటంరెడ్డి టీడీపీలో చేరతానని చెప్పుకుంటున్నప్పటికీ ఆ పార్టీ అందుకు ఇష్టపడటం లేదు. ఆయనపై అనేక కేసులున్నాయి. క్రికెట్ బెట్టింగ్, అటెంప్ట్ మర్డర్ లాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.కొందరితో స్థానికంగా సమస్యలు వస్తాయని భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో టీడీపీ బలపడిన నియోజకవర్గాల్లో వైసీపీ వారిని చేర్చుకుంటే.. ఇంతకాలం పనిచేసిన వారు నొచ్చుకునే అవకాశం చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
ఆనంకు ఓకే…
ఎవరిని చేర్చుకోకపోయినా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మాత్రం చేర్చుకుంటారని టీడీపీ వర్గాలో చెబుతున్నాయి. ఆయనకున్న ట్రాక్ రికార్డ్, గతంలో టీడీపీలో మంత్రిగా చేసిన అనుభవం, మృదుస్వభావం, మాటలు దాటక పోవడం లాంటి లక్షణాలతో ఆనం అందరికీ దగ్గరయ్యారు. పైగా టికెట్ ఇస్తే ఆయన తప్పక గెలుస్తారన్న విశ్వాసమూ ఉందట..