మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతం అవుతున్న వేళ.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరైన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంటుందన్న అంచనాలు నిజం అయినట్లేనని చెబుతున్నారు.
వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేస్తున్న నేపథ్యంలో.. సీఎం జగన్ ఢిల్లీకి టూర్ పెట్టుకోవటం ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ లో భాగంగా ఆయన పర్యటించాల్సిన విశాఖ.. పొన్నూరు.. హైదరాబాద్ కార్యక్రమాల్ని రద్దు చేసుకున్న ఆయన తాజాగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లుగా చెబుతున్నారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న జగన్.. మంగళవారం జీ20 సన్నాహక సదస్సులో పాల్గొంటారని చెబుతున్నారు. ఒకవేళ.. అలాంటిదే ఉండి ఉంటే.. ఇప్పటివరకు బయటపెట్టకుండా.. హటాత్తుగా ఈ కార్యక్రమాల్ని తెర మీదకు తీసుకురావటం ఏమిటి? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ముమ్మరం అయిన నేపథ్యంలో తన ఆత్మబంధువు.. సోదరుడు వరుసైన అవినాశ్ విషయంలో ఏమైనా చేసేందుకు వీలు ఉంటుందా? అన్న కోణంలోనే ఢిల్లీ పర్యటన ఉందని చెబుతున్నారు.
ఈ టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీని.. హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే.. ఢిల్లీకి వస్తున్న సీఎం జగన్ కు మోడీషాలు అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వటం ద్వారా తాము ఇరుకునపడే అవకాశం ఉందని.. అనవసరమైన విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తారా? లేదంటే.. తమకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించే జగన్ పరిస్థితిని అర్థం చేసుకొని అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates