అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని తక్కువ చేసి మాట్లాడడంతో పాటు, దీనిని నదీ గర్భంలో నిర్మిస్తున్నారని, దీని వెనుక మాఫియా ఉందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో ఇంత భూమి, రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవసరమా అని కూడా ప్రశ్నించారు.

మొత్తంగా తన మనస్తత్వాన్ని ఆయన రెండు రోజుల కిందట జాతీయ మీడియా ముందు ఆవిష్కరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో 48 గంటలు కూడా గడవకముందే వైసీపీ టోన్ మార్చింది. వైసీపీకి అమరావతి అంటే గౌరవం ఉందని, దాని ప్రాధాన్యాన్ని గుర్తించామని పార్టీ కీలక నాయకుడు, రాష్ట్ర వైసీపీ ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ కు అమరావతి అంటే ఎనలేని అభిమానం ఉందన్నారు. అంతేకాదు, జగన్ నివాసం కూడా అమరావతి పరిధిలోనే ఉందని చెప్పారు.

అయితే అమరావతిలో ప్రజాధనం వృథా చేస్తున్నారని, అవసరం లేని భారీ భవనాలు నిర్మిస్తున్నారన్నదే జగన్ అభ్యంతరమని సజ్జల తెలిపారు. ఈ విషయాన్ని ఒక వర్గం మీడియా వ్యతిరేకంగా ప్రచారం చేసిందని ఆయన ఆరోపించారు.

జగన్ పై విమర్శలు చేస్తున్న వారు ఆయన సంధించిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు అనుకూల వర్గాలకు రాజధానిలో భూములు కేటాయిస్తున్నారని జగన్ చెప్పారని, దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు మీద ఉందన్నారు.

జగన్ ఎప్పుడూ రాష్ట్రానికి ద్రోహం చేయలేదని సజ్జల స్పష్టం చేశారు. కేవలం రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతినే ఆయన ప్రశ్నించారని తెలిపారు. ఈ క్రమంలో మరోసారి గ్రాఫిక్స్ వరకే రాజధానిని పరిమితం చేస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించడం గమనార్హం.

రాజధానికి సంబంధించి చంద్రబాబు అనేక వాగ్దానాలు చేశారని, రైతులకు న్యాయం చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఇప్పటికీ రాజధాని రైతులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. కేవలం భ్రమలు కల్పించడం ద్వారా ప్రజలను మోసం చేయలేరన్నారు.

కేవలం అమరావతిలో జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే జగన్ ప్రశ్నించారని, ఇది అభివృద్ధిని అడ్డుకోవడంగా పరిగణించరాదన్నారు. కాగా 48 గంటల్లోనే వైసీపీ తన వైఖరిని మార్చుకుందా అంటే, స్పష్టంగా రాజధానిగా అమరావతిని పూర్తిగా అంగీకరించడం లేదన్న విషయం మాత్రం స్పష్టమైంది. అయితే ప్రజాగ్రహాన్ని గుర్తించడం మాత్రం విశేషంగా మారింది.