తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోవడానికి నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలకు ఒక చోట తేలిగ్గానే ఫలితం వస్తోంది. కానీ ఇంకో చోట మాత్రం ఇబ్బంది తప్పట్లేదు. స్పెషల్ షోలు, అదనపు రేట్ల ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు అడగడం ఆలస్యం వచ్చేస్తున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం అనిశ్చితి తప్పట్లేదు. ప్రభుత్వం నుంచి జీవో తెప్పించుకోవడానికి నిర్మాతలు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు కోర్టు నుంచి అడ్డంకులు తప్పట్లేదు.
సంక్రాంతికి రిలీజ్ కానున్న పెద్ద సినిమాలు రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు మేకర్స్ కోర్టు నుంచి అడ్డంకులు రాకుండా ముందే అక్కడి నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవడంతో స్పెషల్ షోలు, అదనపు రేట్లకు ఏ ఇబ్బందీ ఉండదని అనుకున్నారు. కానీ ‘రాజాసాబ్’కు ముందు రోజు ప్రిమియర్లు అనుకున్న ప్రకారం పడలేదు. అర్ధరాత్రి వరకు తీవ్ర గందరగోళం తప్పలేదు.
షోలు ఉంటాయని థియేటర్ల దగ్గరికి వచ్చిన అభిమానులు నరకయాతన అనుభవించారు. చివరికి 11.30-12 గంటల మధ్య షోలు మొదలయ్యాయి. అప్పటికి అదనపు రేట్ల కోసం జీవో బయటికి రాకపోవడంతో కొన్ని థియేటర్లు అప్పటికప్పుడు బుకింగ్స్ మొదలుపెట్టి థియేటర్లను నింపాయి. నార్మల్ రేట్లతోనే ఆ షోలన్నీ నడవడం విశేషం.
థియేటర్ల ముందు పడిగాపులు పడ్డందుకు ఫలితమా అన్నట్లు సాధారణ ధరలతోనే ప్రిమియర్ షోలు చూసే అవకాశం హైదరాబాద్ ప్రభాస్ అభిమానులకు దక్కింది. సింగిల్ స్క్రీన్లలో రూ.175తో, మల్టీప్లెక్సుల్లో రూ.295తో సినిమా చూశారు ఆడియన్స్. జిల్లాల్లో ఎక్కడా పూర్తిస్థాయిలో ప్రిమియర్లు పడినట్లు లేవు. ఏపీలో మాత్రం సెకండ్ షోలు ఏ సమస్యా లేకుండా టైంకి పడిపోయాయి.
ముందే ఆ షోలకు స్పెషల్ రేట్లు పెట్టి జీవోలు ఇవ్వడంతో థియేటర్లు ఇబ్బంది పడకుండా టికెట్లు అమ్ముకున్నాయి. రూ.1000 ఫ్లాట్ రేటుతోనే ఏపీ ప్రేక్షకులు ప్రిమియర్స్ చూశారు. కానీ తెలంగాణలో ఉదయం రెగ్యులర్ షోలకు మాత్రం రేట్ల పెంపు వర్తించింది. అర్ధరాత్రి తర్వాత రేట్ల పెంపు జీవో బయటికి రావడంతో సింగిల్ స్క్రీన్లలో రూ.300, మల్టీప్లెక్సుల్లో రూ.450 రేటుతో సినిమా చూస్తున్నారు ప్రేక్షకులు. వీకెండ్ తర్వాత ఈ రేట్లు కొంతమేర తగ్గనున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates