తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ ఆమెను వేధిస్తున్నారని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏరి కోరి ఆ మహిళా ఐఏఎస్ అధికారిని నల్గొండ జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్న సదరు మంత్రి, ప్రేమ పేరుతో ఆ అధికారిణి వెంట పడుతున్నారని జరుగుతున్న ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒకేసారి ఇంత విషం ఇచ్చి చంపేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు.
ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై దుష్ప్రచారం తగదని, అది దురదృష్టకరమని అన్నారు. మహిళా అధికారులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. తనపై ఏమైనా రాయాలనుకుంటే రాయొచ్చని, తట్టుకుని నిలబడగలనని అన్నారు. కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని హెచ్చరించారు.
రేటింగ్ కోసం, వ్యూస్ కోసం అవాస్తవాలను వండివార్చడం, తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, అడ్డగోలు రాతలు తగవని హెచ్చరించారు.
తాను మంత్రి అయిన తర్వాత నల్గొండ జిల్లాలో నలుగురు కలెక్టర్లు బదిలీ అయ్యారని గుర్తు చేశారు. అయినా ఐఏఎస్ అధికారుల బదిలీ వ్యవహారం ముఖ్యమంత్రి చూసుకుంటారని, మంత్రులకు కూడా ఆ ప్రక్రియలో ప్రత్యక్ష పాత్ర ఉండదని చెప్పారు.
మహిళా ఐఏఎస్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
తన కొడుకు చనిపోయినప్పుడే సగం చచ్చిపోయానని, ఈ రకమైన తప్పుడు ఆరోపణలతో ఇంకా మానసికంగా హింసిస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. తనను వేధించడం సరిపోలేదనుకుంటే ఒకేసారి విషం ఇచ్చి చంపేయాలని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates