పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి, ధర్మ పరిరక్షణకు చేసిన కృషికి ఇటీవల “అభినవ శ్రీ కృష్ణదేవరాయ” బిరుదు అందుకున్న పవన్ కళ్యాణ్, తాజాగా మార్షల్ ఆర్ట్స్ రంగంలో “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఈ ప్రతిష్టాత్మక బిరుదుతో ఆయనను ఘనంగా సత్కరించింది.

ఇదే సందర్భంలో ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో పవన్ కళ్యాణ్‌కు అధికారిక ప్రవేశం లభించడం విశేషంగా మారింది. జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన భారతీయుల్లో ఒకరిగా ఆయన నిలిచారు. సినిమాలు, రాజకీయాల్లోకి రాకముందే మార్షల్ ఆర్ట్స్ సాధన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, చెన్నైలో ఉన్న సమయంలో కరాటే సహా పలు యుద్ధకళల్లో కఠినమైన శిక్షణ పొందారు. జపనీస్ సమురాయ్ సంప్రదాయాలు, యుద్ధ తత్వంపై ఆయన చేసిన లోతైన అధ్యయనం ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపుగా మారింది.

ఈ అంకితభావాన్ని గుర్తించిన జపాన్‌కు చెందిన సోగో బుడో కన్‌రి కై సంస్థ పవన్ కళ్యాణ్‌కు ఫిఫ్త్ డాన్ ర్యాంక్‌ను ప్రదానం చేసింది. అలాగే, టకేదా షింగెన్ క్లాన్ లినియేజ్‌లో ప్రవేశం పొందిన తొలి భారతీయుడిగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది. ఇటు సాంస్కృతిక రంగంలో, అటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ పవన్ కళ్యాణ్ సాధిస్తున్న గుర్తింపులు ఆయన బహుముఖ వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ విడుదల చేసిన మాంటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. చిన్ననాటి ఫొటోలు, బ్లాక్ బెల్ట్ వేడుకల దృశ్యాలు, ‘తమ్ముడు’, ‘పంజా’, ‘ఓజీ’ చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలతో రూపొందించిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. 2025 డిసెంబర్ చివర్లో ఆయనకు లభించిన గౌరవాలను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు, పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ, సాధనపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.