సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన పరీక్షను ఎదుర్కొంటోంది. ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టినప్పటికీ సాధారణ ప్రేక్షకుల నుంచి వస్తున్న మిశ్రమ స్పందన కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో బుకింగ్స్ నెమ్మదించడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి టైమ్ లో సినిమాని నిలబెట్టే బాధ్యత పూర్తిగా అభిమానుల చేతుల్లోనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజానికి గతంలో దేవర సినిమా విషయంలో కూడా సరిగ్గా ఇలాంటి వాతావరణమే కనిపించింది. సినిమా రిలీజైన మొదట్లో టాక్ భిన్నంగా రావడంతో అంతా ఆందోళన చెందారు. కానీ ఎన్టీఆర్ అభిమానులు రంగంలోకి దిగి సోషల్ మీడియా వేదికగా చేసిన క్యాంపెయిన్ ఆ సినిమా దశను మార్చేసింది. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే కచ్చితంగా ఎంజాయ్ చేయవచ్చనే విషయాన్ని వారు జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆ మౌత్ టాక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది.
తారక్ ఫ్యాన్స్ తీసుకున్న ఆ చొరవ వల్ల దేవర బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణించడమే కాకుండా భారీ వసూళ్లను సాధించి అందరినీ సేఫ్ జోన్ లోకి చేర్చింది. కేవలం నెగిటివ్ కామెంట్స్ కి పరిమితం కాకుండా సినిమాలో ఉన్న హైలైట్స్ ని ప్రమోట్ చేయడం వల్ల ఆడియన్స్ థియేటర్ల వైపు మొగ్గు చూపారు. దేవర అనేది ఒక పక్కా మాస్ బొమ్మ కావడం కూడా దానికి ప్లస్ అయింది. దానితో పాటు అనిరుధ్ ఇచ్చిన పాటలు ఏ రకంగా పేలాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ రాజా సాబ్ ఒక కొత్త ప్రయత్నం కావడంతో ఈ సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది ఇప్పుడు అసలైన ప్రశ్న.
దేవర సినిమా రిలీజ్ టైమ్ లో పెద్దగా పోటీ లేదు కానీ రాజా సాబ్ కి ఇప్పుడు భారీ పోటీ ఎదురవుతోంది. మెగాస్టార్ చిరంజీవి MSG సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా వరుసగా క్యూ కడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత పుష్ చేసినా రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద బూస్ట్ అవ్వడం కొంచెం టఫ్ గానే కనిపిస్తోంది. ప్రస్తుతం రాజా సాబ్ లో ప్రభాస్ కామెడీ టైమింగ్ ఆయన వింటేజ్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వీటిని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లగలిగితే బాక్సాఫీస్ వద్ద పరిస్థితి మారే అవకాశం ఉంది.
సెలవుల సీజన్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడమే ఇప్పుడు మేకర్స్ ముందున్న ప్రధాన లక్ష్యం. ఒకవేళ డార్లింగ్ ఫ్యాన్స్ కూడా దేవర తరహాలో సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసినా రాజా సాబ్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చెప్పలేం. సంక్రాంతి రేసులో మరికొన్ని సినిమాలు పోటీగా వస్తున్న తరుణంలో రాజా సాబ్ తన పట్టు నిలుపుకోవడం చాలా ముఖ్యం.
Gulte Telugu Telugu Political and Movie News Updates