ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా రాలేదు. పైగా రాజధాని రైతులు ఉద్యమించినప్పుడు, న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుమల వరకు పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలు విస్తృతంగా సంఘీభావం ప్రకటించారు. వైసీపీ నాయకుల్లో కూడా కొందరు రైతులకు మద్దతుగా నిలిచారు. కాబట్టి రాజధానిపై మాట్లాడే అధికారం వారికి ఉంటుంది.
కానీ ఆది నుంచి అమరావతిపై ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్న జగన్ కు నిజంగా రాజధానిపై మాట్లాడే హక్కు ఉందా అనేదే అసలు ప్రశ్న. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఏ అంశంపైనైనా ఆయన మాట్లాడవచ్చు. కానీ రాజధాని విషయంలో మాత్రం ఆయన అనుసరించిన విధానాలే ఆయనకు మాట్లాడే అర్హత లేదని స్పష్టంగా చెబుతున్నాయి.
ప్రధానంగా 2018, 2019 మధ్య కాలంలో రాజధానిని కొనసాగిస్తామని, 33 వేల ఎకరాల్లో అమరావతి రాజధాని ఉంటుందని జగన్ ప్రజల మధ్య ప్రకటించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకే ఆయన పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు.
ఏపీకి ఒకే రాజధాని కాదు, మూడు రాజధానులు ఉంటాయని చెప్పారు. విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించారు. ఇది పెద్ద వివాదంగా మారింది. రైతులు ఉద్యమించారు. నిరసనలు చేపట్టారు. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్లారు. అయినా జగన్ మాత్రం ఎలాంటి సానుకూల స్పందన చూపలేదు. మూడు రాజధానులపైనే పట్టుబట్టారు.
ఈ క్రమంలో రైతులకు ఇవ్వాల్సిన కౌలు చెల్లింపులను కూడా నిలిపివేశారు. కోర్టులు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని ఆదేశించడంతో మొక్కుబడిగా కౌలు చెల్లించారు. మరోవైపు రైతులపై వేలాది కేసులు పెట్టారు. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
అదే సమయంలో రాజధాని ప్రాంతంలో జగన్ అన్న ఇళ్ల కాలనీల పేరుతో ఇతర జిల్లాల పేదలకు భూములు కేటాయించి, రాజధాని స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలు చేశారు. ఇలా అడుగడుగునా అమరావతిని నిర్వీర్యం చేసేలా వ్యవహరించిన జగన్ కు ఇప్పుడు రాజధానిపై మాట్లాడే అర్హత ఉందా అన్న ప్రశ్నను ప్రజలు, ప్రజాసంఘాలు, వైసీపీేతర పార్టీలు గట్టిగా సంధిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates