సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. ఇందులో ప్రధానంగా ఏ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, ఏ అంశాలపై అసంతృప్తిగా ఉన్నారు, ఏ శాఖలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే విషయాలను పరిగణలోకి తీసుకున్నారు.

ఈ సర్వేలో భాగంగా ప్రధానంగా రెవెన్యూ శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఫిర్యాదులు రావడం కనిపించింది. అదే విధంగా అవినీతికి ఆలవాలంగా రెవెన్యూ శాఖ మారిందనే వాదనలు వినిపించడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.

ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఏ చిన్న పని జరగాలన్నా రెవెన్యూ శాఖలో చేతులు తడపందే పనులు జరగడం లేదన్నది ప్రజల నుంచి వస్తున్న ప్రధాన విమర్శ. ఇదే సమయంలో రీ సర్వే విషయంలో కూడా ఇప్పటికే వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిచేసుకోలేకపోవడం, అవే తప్పులు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆ తప్పులను సరిచేయడానికి మరోసారి లంచాలు డిమాండ్ చేస్తున్న వ్యవహారాలు సాక్షాత్తు సీఎం చంద్రబాబు వరకు చేరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

రెవెన్యూ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్న సీఎం చంద్రబాబు, ప్రజల సంతృప్తి మరియు అసంతృప్తిలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పదే పదే చెబుతున్నారు. గత ఏడాది ఈ విషయంపై రెండు మూడు సార్లు ఆయన నిర్వహించిన సమీక్షల్లో కూడా రెవెన్యూ శాఖ సమస్యలను గంభీరంగా తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు రీ సర్వే చేసి ఇచ్చిన పట్టాల్లో జగన్ ఫోటోలు ఉంచడం ద్వారా నాటి సీఎం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అదే సమయంలో పలు అవకతవకలు కూడా జరిగాయి.

ఈ పరిణామాలను సరిదిద్దుతూ, ప్రస్తుతం ఈ విధానాన్ని సానుకూలంగా మరియు పారదర్శకంగా అమలు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రధాన అడ్డంకిగా మారుతున్నారన్నది కీలక అంశం.

ఈ సమస్యలను ప్రభుత్వం ఏ స్థాయిలో పరిశీలిస్తుంది, ఎంతవరకు పరిష్కరిస్తుంది అన్నదానిపైనే ప్రజల్లో సంతృప్తి స్థాయి ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే సీఎం చంద్రబాబు ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.