ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ దూకుడు.. ఏ రేంజ్‌లో అంటే!

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఓ రేంజ్‌లో పుంజుకుంది. రెండు జిల్లాల్లోనూ క‌లిపి మొత్తం 30 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఐదు చోట్ల మాత్ర‌మే విజయం ద‌క్కించుకున్న టీడీపీ ఈ మూడున్న‌రేళ్ల‌లో భారీగా పుంజుకుంద‌ని తాజా అంచ‌నాలు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి రెండు గోదావ‌రి ఉమ్మ‌డి జిల్లాల్లోనూ టీడీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. అయితే.. గ‌త వైసీపీ దూకుడు, జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో టీడీపీ ఓటు బ్యాంకు చెల్లాచెదురైంది.

అయితే.. జ‌గ‌న్‌పై ఆశ‌లు పెట్టుకున్న కాపు నాయ‌కులు.. ఇత‌ర సామాజిక వ‌ర్గాలు కూడా ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఐప్యాక్ స‌హా టీడీపీ చేయించిన స్వ‌తంత్ర స‌ర్వేల్లోనూ వైసీపీకి ఎదురు గాలి వీస్తుండ‌గా.. టీడీపీకి సానుకూల ప‌వ‌నాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి 42 శాతం నుంచి 48 శాతం వ‌ర‌కు ఓటు బ్యాంకు క‌నిపిస్తోంది.

అదికూడా పార్టీ ఒంట‌రిగా పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యానికి అవ‌కాశం మెరుగుప‌డిన‌ట్టు చెబుతున్నారు. ముమ్మిడివ‌రం, పెద్దాపురం, అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ మెజారిటీ ఓటు బ్యాంకును కైవ‌సం చేసుకుంది. ఇక‌, సిట్టింగ్ స్థానాలైన రాజ‌మండ్రి రూర‌ల్‌, రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌చ్చితంగా మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునేదిశ‌గా టీడీపీ వేగంగా ప‌రుగులు పెడుతోంది. ఇక‌, కాకినాడ సిటీ, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య ఫైట్ భీక‌రంగా ఉంద‌ని తెలుస్తొంది.

ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనూ రెండు పార్టీల మ‌ధ్య పోరు తీవ్రంగానే సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. దెందులూరు, పాలకొల్లు, ఉండి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. దెందులూరులో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ విజ‌యం రాసిపెట్టుకోవచ్చ‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇక‌, గోపాల‌పురం ఎస్పీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఈ ద‌ఫా విజ‌యం టీడీపీదేన‌ని అంటున్నారు. అయితే, ఏలూరు అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాల్లో మాత్రం పోటీ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఏదేమైనా.. గ‌త ఎన్నిక‌ల‌తోపోల్చుకుంటే.. టీడీపీ జోరుగా పుంజుకుంద‌ని పార్టీ అంచ‌నా వేసింది.