సైకిల్ కి కమలం దూరం..దూరం..

భీమవరం సమావేశంలో బీజేపీ ఒక అనధికారిక డిక్లరేషన్ ఇచ్చేసింది. ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని తేల్చేసింది. టీడీపీ, వైసీపీకి సమదూరం పాటిస్తామని రాష్ట్ర కార్యవర్గం సాక్షిగా జాతీయ నేతలు ప్రకటించేశారు. దీనితో ఇప్పుడు కమలంతో దోస్తీపై తేల్చుకోవాల్సిన అనివార్యత పవన్ కల్యాణ్ పై పడింది..

పార్టీలో రెండు వర్గాలు

ఏపీలో బీజేపీ అంత బలమైన పార్టీ ఏం కాదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఒక శాతం ఓట్లు కూడా రాలేదు. చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో పార్టీ చాలా బలంగా కనిపిస్తుంది.మీటింగులు, ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తుంటుంది. పొత్తులపై నిరంతరం ప్రకటనలిస్తుంది..

రాష్ట్ర బీజేపీలో రెండు గ్రూపులున్నాయ్. టీడీపీని సమర్థించే గ్రూపు ఒకటైతే.. వైసీపీకి దగ్గర కావాలనుకునే గ్రూపు రెండోది. రెండు గ్రూపులను కట్టడి చేసేందుకు అధిష్టానం ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్లుగా అనుకోవాలి. తమ ఆలోచనా విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధం కావాలని భీమవరం వేదికగా అధిష్టానం ప్రతినిధులు దిశానిర్దేశం చేశారు.

అసలు సంగతి అదా… ?

కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ హోటల్ లో పవన్ కల్యాణ్ ను కలిశారు. వైజాక్ లో జనసేనానిని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంతో సంఘీభావం తెలిపేందుకు వెళ్లారు. అప్పుడు చంద్రబాబు స్వయంగా ఎన్నికల పొత్తు, సీట్ల సర్దుబాటును ప్రస్తావించారు. నలభై స్థానాలు వరకు జనసేనకు ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యాయి. అయితే బీజేపీని పట్టించుకోవద్దని, అంతగా పొత్తు పెట్టుకోవడం అనివార్యమైతే చెరి రెండు స్థానాలు కేటాయిద్దామని చంద్రబాబు అన్నారట. అంటే పొత్తు పెట్టుకుంటే బీజేపీ పోటీ చేసేది నాలుగు స్థానాలు మాత్రమేనని చంద్రబాబు తేల్చేశారు.

ఎంత రహస్యంగా మాట్లాడుకున్నా విషయం బీజేపీకి చేరిపోయింది. దానితో కమలం పార్టీ ఖంగుతిన్నది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు జాతీయ పార్టీని నడపాలా.. చంద్రబాబు జోకులేస్తున్నారా అని బీజేపీ నేతలు ఆగ్రహం చెందారట. అందుకే ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉండదంటూ ప్రకటనలిస్తున్నారు. ఇదీ పవన్ కల్యాణ్ కు కూడా సందేశమేనని భావిస్తున్నారు. మాతో పొత్తు కావాలో వద్దో త్వరగా తేల్చమని పవన్ పై బీజేపీ వత్తిడి తెస్తున్నట్లుగా ఉంది. మరి అయోమయ చక్రవర్తి పవన్ త్వరగా నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి..