జగన్ ముందు మాస్క్ పెట్టుకో, తర్వాత జనానికి చెప్పు – చంద్రబాబు

నిమ్మగడ్డ ఎఫెక్టో ఏంటో గాని కోవిడ్ 19 వచ్చినప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏనాడూ దానిని లెక్క చేయలేదు. ముందు నుంచి దానిని ఆయన సీరియస్ గా తీసుకోవడం లేదు. టెస్టులు పెంచుతున్నారు, ఆస్పత్రులు పెంచుతున్నారు. చికిత్సలు పెంచుతున్నారు. కానీ కోవిడ్ అందరికీ వచ్చేదే, ఏమీ భయపడకండి అన్ని సదుపాయాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా మాస్కుల గురించి అధికారికంగా ప్రతిఒక్కరు వేసుకోవాలని జగన్ ఆర్డరు కూడా వేశారు. ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు.

ముఖ్యమంత్రి అసమర్థత, అలసత్వం వల్లే కరోనా రాష్ట్రంలో ఇంతగా విస్తరించింది. ఇన్నాళ్లకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆయన జీవో తెచ్చారు. జనాలకు మాస్కు వేసుకోమని చెబుతున్న సీఎం జగన్ ఇంతవరకు ఏ మీటింగ్ లోను మాస్కు ధరించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. చివరకు పులివెందులకు వచ్చినపుడు అంతమంది జనంలో ఉన్నపుడు కూడా మాస్కు ధరించలేదు అన్నారు. తాను ఇప్పటివరకు మాస్కు ధరించకుండా ఇతరులు మాస్కు ధరించకపోతే జరిమానా వేస్తామనడం సరికాదని అన్నారు. తాను మాస్కు ధరించి జనాలకు ఆదర్శంగ నిలవాలన్నారు.

ఈరోజు ఏపీలోని 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో చంద్రబాబు ప్రత్యేక వర్చువల్ సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా మాస్కులపై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలోనే కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు గురించి చర్చ వచ్చింది. దీనిని అస్సలు వదలొద్దని, ఇకపై ఎవరైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని తాకితే వణుకొచ్చేలా చర్యలుండాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.