ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికి.. ముందస్తుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారన్న ప్రచారం రాజకీయాల్ని మరింత వేడెక్కిస్తోంది. అదే సమయంలో ఎన్నికల వేళ.. హడావుడిగా పొత్తులకు పోకుండా.. ముందునుంచే ఆ దిశగా ప్రయత్నాలు సాగుతుండటం.. అందుకు తగ్గ పరిణామాలు గడిచిన కొద్దిరోజులుగా చూస్తున్న సంగతి తెలిసిందే.
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ.. జనసేనల మధ్య పొత్తు దాదాపుగా ఖరారైన విషయం తెలిసిందే. అధికారికంగా ఈ ఇరు పార్టీల అధినేతలు ఒక వేదిక మీద నుంచి పొత్తు మాట మాట్లాడకున్నా.. పొత్తుల విషయంపై పవన్ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించటం.. తన క్యాడర్ కు ఆయన చెబుతున్న మాటల్ని చూస్తే.. పొత్తు పక్కా అన్న విషయంపై క్లారిటీ వచ్చేసినట్లే. దీంతో.. జనసేనతో టీడీపీ పొత్తు నేపథ్యంలో.. సీట్ల పంపకాలు ఎలా ఉంటాయి? ఏయే నియోజకవర్గాల్ని ఎవరు తీసుకుంటారన్న దానిపై కసరత్తు జరగలేదు.
అయితే.. ఇరు పార్టీలకు చెందిన ముఖ్యులు మాత్రం తాము పోటీ చేసే నియోజకవర్గాలు ఏమిటన్న దానిపై పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు తమకున్న అవకాశాల్ని చూసుకుంటున్న నేతలు కొందరు.. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ తాజాగా జనసేనలోకి వెళ్లేందుకు రెఢీ అవుతున్నట్లుగా చెబుతున్నారు.
ఈ నెల 26న ఆయన జనసేనలోకి వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ముగిశాయని.. ఆయన పార్టీలో చేరాక.. వచ్చే ఎన్నికల్లో సత్తెన పల్లి అసెంబ్లీ టికెట్ ను ఆయనకు కేటాయించాలన్న హామీతోపార్టీలో చేరుతున్నట్లుగా చెబుతున్నారు. విశేష రాజకీయ అనుభవంతో పాటు.. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న కన్నా లక్ష్మీనారాయణ.. తన సర్వశక్తుల్ని ఒడ్డి తన సత్తా చూపాలని తపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలోకి చేరితే.. సత్తెనపల్లి సీటు ఆయనకు ఖాయమని చెప్పాలి.
అదే జరిగితే.. మంత్రి అంబటి రాంబాబుకు చుక్కలు ఖాయమంటున్నారు. ఒకే సామాజిక వర్గంతో పాటు.. ఓటమితో కుతకుతలాడుతున్న కన్నా.. తనకు లభించిన అవకాశాన్ని అస్సలు వదులుకోరని.. అదే జరిగితే..కన్నాతో తలపడటం అంబటికి కష్టమన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కన్నా జనసేనలోకి చేరినంతనే ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలు మరో లెవల్ కు వెళ్లటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.