ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయం రసకందాయంలో పడింది. చీరాల స్ట్రాంగ్ మేన్ గా పిలిచే ఆమంచి కృష్ణమోహన్ , పరుచూరు ఇంఛార్జ్ పగ్గాలు చేపట్టి, చీరాల నుంచి వైదొలిగిన తర్వాత మిగిలిన నేతల్లో పోటీ పెరిగింది. వైసీపీలో చేరిన ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేశ్ తో పాటు, పోతుల సునీత సహా ఒకరిద్దరు నేతలు బరిలో ఉన్నారు. ఈ సారి బీసీ సామాజిక వర్గాలకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరగడంతో సునీత ఆశలు పెట్టుకున్నారు. నిన్న మొన్నటి వరకు కరణం శిబిరంతో కలిసి నడిచిన ఎమ్మెల్సీ పోతుల సునీత కొత్త దారి వెతుక్కోవడంతో చీరాల రాజకీయం మూడు ముక్కలాటగా మారిపోయింది. పోతుల సునీత వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక చీరాలలో దూకుడు పెంచారు.
అయిష్టంగానే ఆమంచి
ఆమంచికి చీరాలలో మంచి పట్టు ఉంది. అయితే కరణం బలరాం వైపు మొగ్గు చూపాలని నిర్ణయించిన జగన్.. ఒక ప్రణాళిక ప్రకారం ఆమంచిని చీరాల నుంచి తప్పించారు. పరుచూరు ఇంఛార్జ్ గా ప్రకటించారు. అంటే మీకు చీరాల టికెట్ లేదు.. పర్చూరులో పోటీ చేయాలన్న సందేశం కూడా అందులో ఉంది. అయితే పర్చూరుపై డౌట్లు ఉన్న ఆమంచి.. తొలుత అక్కడి బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించారు తర్వాత జగన్ కు కోపం వస్తుందన్న అనుమానంతో పాటు అధిష్టానం ప్రతినిధులు బుజ్జగించడంతో వెళ్లిపోయారు.
బాలినేని చెప్పేశారు..
కరణం బలరాం వైసీపీ వైపు మొగ్గు చూపిన తర్వాత ఆయన తనయుడు కరణం వెంకటేశ్.. వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధినేత జగన్ ఏది చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. దానితో ఆయనకు చీరాల ఇంఛార్జ్ పదవి దక్కింది. వచ్చే ఎన్నికల్లో బలరాం పోటీ చేయరని, కొడుక్కి టికెట్ అడుగుతున్నారని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. చేనేత సామాజిక వర్గానికి చెందిన పోతుల సునీత మాత్రం బీసీ లెక్కల్లో తనకు టికెట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే మాజీ మంత్రి అయిన ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు బాంబు పేల్చేశారు. కరణం వెంకటేశ్ కు టికెట్ ఖరారైందని, జగన్ స్వయంగా చెప్పిన తర్వాత ఇక మాట్లాడాల్సిందేమి ఉంటుందని వైరి వర్గాలను ప్రశ్నించారు..
అసలేం జరిగింది..
చీరాల టికెట్ పై క్లారిటీ లేక నాయకులంతా కొట్టుకుంటున్న తరుణంలో కరణం వెంకటేశ్ ను సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి పిలిపించి మాట్లాడారు. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లవద్దని మీకే టికెట్ ఖరారవుతుందని చెప్పి పంపించారు. ప్రస్తుతానికి బాలినేని గ్రూపులో ఉన్న కరణం వెంకటేష్ ఆ సంగతి ఆయన చెవిన పడేశారు. చీరాల మీటింగులో బాలినేని తొందపడి వెంకటేశ్ అభ్యర్థిత్వానికి జగన్ మద్దతు ఉందని ప్రకటించారు. దానితో ఇప్పుడు వైరి వర్గాలు ఆగ్రహం చెందుతున్నాయి. వారి తదుపరి స్టెప్ ఏమిటో చూడాలి..
Gulte Telugu Telugu Political and Movie News Updates