‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు. మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చినా ఆ విషయాన్ని ఇగ్నోర్ చేస్తారు. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ సైతం ఇదే పని చేసింది. తెలుగులో ఆమె ఇప్పటిదాకా మూడు సినిమాలు చేసింది. తొలి చిత్రం ‘సీతారామం’ కల్ట్ స్టేటస్ తెచ్చుకోగా.. రెండో సినిమా ‘హాయ్ నాన్న’ కూడా బాగా ఆడింది. కానీ పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించిన మూడో చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ మాత్రం పెద్ద డిజాస్టర్ అయింది.

సినిమా ఆడకపోవడానికి తోడు అదొక ట్రోల్ మెటీరియల్‌ లా మారింది. అందుకే టీంలో ఎవ్వరూ ఆ సినిమా గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఇప్పుడు మృణాల్ కూడా అదే పని చేసింది. తన కొత్త చిత్రం ‘డెకాయిట్’ టీజర్ లాంచ్ సందర్భంగా ఆమె తెలుగులో నటించిన మిగతా సినిమాల్లో పాత్రల గురించి ప్రస్తావించి.. ‘ఫ్యామిలీ స్టార్’లో చేసిన ఇందు పాత్రను స్కిప్ చేసింది.

‘‘మళ్లీ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు మృణాల్‌లోని కొత్త నటిని ఈ సినిమాలో చూస్తారు. మీరు నన్ను సీతగా చూశారు. యశ్నగా చూశారు. ఇప్పుడు మీరు జూలియట్ అలియాస్ సరస్వతిగా కొత్త మృణాల్‌ను చూస్తారు. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు. ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. నా కెరీర్లో కథ విన్న కొన్ని నిమిషాల్లో సినిమా చేయడానికి  ఒప్పుకున్న తొలి సినిమా ఇదే. ఇంకో 15 రోజులకే సెట్స్ లోకి వచ్చేశాను. ఇలా జరగడం అరుదు.

ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాను. నేనే కాదు, టీం అంతా అలాగే చేసింది. అందరం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో శేష్ వల్ల నా చేతికి అయిన గాయం గుర్తు కూడా ఉంది. అది మీకు చూపించాలని ఉంది. కానీ మరక ఎప్పుడూ మంచిదే’’ అని మృణాల్ పేర్కొంది. ముందు శ్రుతి హాసన్‌ను ఈ సినిమాకు కథానాయికగా ఎంచుకోగా.. ఏవో కారణాలతో ఆమె తప్పుకుంది. తర్వాత ఆ స్థానంలోకి మృణాల్ వచ్చింది. ‘గూఢచారి’ సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.