పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ సూత్రం తెలుసుకున్న నేత సీఎం చంద్రబాబు నాయుడు. 23 స్థానాలు గెలిచినప్పుడైనా, 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పుడైనా ఆయన అదే పంథాను అనుసరిస్తున్నారు. వారి పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుని, వారితో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తుంటారు. వారికి దిశానిర్దేశం చేస్తుంటారు. అదే బాటలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నడుస్తున్నారు.
జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వన్‌టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటిగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై చర్చించినట్లు సమాచారం. సంక్షేమ పథకాల అమలు, ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల వివరాల గురించి తెలుసుకున్నారు.
ఈ రోజు ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, దేవ వరప్రసాద్, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్‌లతో వన్‌టూ–వన్ సమావేశం అయ్యారు.
జనసేన పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎక్కువ మంది తొలిసారి గెలిచారు. వారు సరిగా లేకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పదవి అనేది అలంకారం కాదు, అది ఒక బాధ్యత అనే సందేశాన్ని పవన్ చాలా వేదికలపై చెబుతూనే ఉన్నారు.
పొలిటికల్ అకౌంటబిలిటీ ఏ పార్టీలో అయినా ముఖ్యమే. అందుకే ఇరు పార్టీల నేతలు తమ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, అవినీతికి తావులేకుండా పారదర్శక పాలనలో ఎలా భాగస్వామ్యం వహించాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates