ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. శుక్రవారం ఉదయమే పార్టీ నాయకులతో ఆయన టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. తాజాగా తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ సాధించిన విజయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలో అదే ఫలితం ఏపీలోనూ రావాలని సూచించారు. టిడిపి శ్రేణులు… నాయకులు ప్రజలకు చేరువ కావాలన్నారు.
పార్టీ కార్యక్రమాలు.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. వాస్తవానికి ఈ విషయాన్ని ఆది నుంచి సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాలకు, అదే విధంగా ప్రజల మధ్యకు వెళ్లాలని కూడా ఆయన తాజాగా మరోసారి సూచిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న క్రమంలో పార్టీ నాయకులు అందరూ అలెర్ట్ గా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
పక్కనే ఉన్న తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లలేదన్న విషయం స్పష్టం అయింది. అదే ఫలితం ఏపీలోనూ కనిపించాలి.. అని చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాలకు సిద్ధపడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వచ్చే జనవరి నుంచి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి, ప్రభుత్వ కార్యక్రమాలకు అందరూ హాజరు కావాలని.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని కూడా చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఈ మేరకు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తమ తమ కార్యక్రమాల్లో మార్పులు కూడా చేసుకోవాలని సీఎం చంద్ర బాబు సూచించారు. అందరూ కలిస్తే.. తిరుగులేని విధంగా కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని.. గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధిని కూడా వివరించాలని తెలిపారు. తమకు సంబంధం లేదని ఎవరూ భావించరాదని కూడా చంద్రబాబు తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates