వరవరరావు పరిస్థితి ఏమంత బాలేదు

బీమాకోరేగావ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రెండేళ్లుగా మహారాష్ట్ర జైలులో ఉంటూ ఇటీవల కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత, కవి వరవరరావు పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన అంపశయ్యపై ఉన్నారని.. ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతారని అంటున్నారు.

స్వయంగా ఆయన తరఫున లాయర్ సుదీప్ పస్బోలా కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 ఏళ్ల వరవరరావు.. ఇటీవల తన భార్యతో ఫోన్లో మాట్లాడినపుడు ఆమెను గుర్తించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనేక డిమాండ్ల తర్వాత ఆయన్ని జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు.

ఐతే అదే సమయంలో ఆయనకు కరోనా సోకింది. అసలే తీవ్ర అనారోగ్యం, పైగా కరోనా సోకడంతో వరవరరావు పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత స్థితిలో వరవరరావు ఏమీ ఆలోచించే స్థితిలో లేరని.. విచారణను ప్రభావితం చేసే స్థితిలోనూ లేరని.. చివరి దశలో ఉన్న ఆయన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టుకు లాయర్ విన్నవించారు.

‘‘వరవరరావు అంపశయ్యపై ఉన్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. మరి కొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశముంది. కనీసం తన కుటుంబ సభ్యుల మధ్య చనిపోయే అవకాశాన్ని ఆయనకు ఇవ్వండి. విచారణను ఏ విధంగానూ ప్రభావితం చేసే పరిస్థితిలో లేని వరవరరావుకు బెయిల్ ఇప్పించండి’’ అని కోర్టుకు లాయర్ విన్నవించారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కవులు, రచయితలు వరవరరావును డిమాండ్ చేయాలన్న పిటిషన్ మీద సంతకాలు చేస్తుండటం గమనార్హం.