ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు!!

టీడీపీలో నేత‌ల తీరు ఏమాత్రం మార‌లేదు. ఇప్ప‌టికే నేత‌ల‌ ప‌రిస్థితి బాగోలేద‌ని.. దీనిని ఎలా లైన్‌లో పెట్టాలా అని చంద్ర‌బాబు స‌త‌మ‌తం అవుతున్నారు. ఒక్కొక్క‌రినీ పిలిచి క్లాస్ ఇస్తున్నారు. మ‌రి ఇంత‌గా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నా.. సీనియ‌ర్ నేత‌లే నోరు పారేసుకుని ర‌చ్చ కెక్క‌డం.. ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా ఉంది. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుపై.. మ‌రో మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు నోరు చేసుకున్నారు.

“ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు.. లక్షల్లో నేనొక్కడిని. గంటా ఏమైనా పెద్ద నాయకుడా..? ప్రధానా..? పార్టీలో అందరూ రావాలి.. పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక” అని మాజీ మంత్రి గంటాపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నిప్పులు చెరిగారు. తామెవ్వరికీ వ్యతిరేకులం కాదన్న అయ్య‌న్న పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని విమర్శించారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండని వారిని చూస్తేనే తమకు బాధేస్తోందని అయ్య‌న్న అన్నారు. తమకు అందరూ కావాలని అయ్యన్న పేర్కొన్నారు. “పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నవాళ్లు కూడా బాగుండాలనే కోరుకుంటాం. టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారు. టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసింది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.

సాఫ్ట్ వేర్ కంపెనీ.. హార్డ్ వేర్ కంపెనీలే కాదు.. అండర్ వేర్ కంపెనీలు కూడా పోతున్నాయని ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారన్నారు. రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని దుయ్య‌బ‌ట్టారు. భారతీ సిమెంట్స్ ధర మిగిలిన వాటికంటే రూ. 20 ఎక్కువగా ఉంద‌ని, సీఎం జగన్ ముద్దుల భార్య కంపెనీ అనేనా ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు.

త్వరలో టీడీపీ బీసీ నేతల సమావేశం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు అయ్య‌న్న చెప్పారు. మూడు ప్రాంతాల్లో(ఉత్తరాంధ్ర‌, మ‌ధ్యాంధ్ర‌, సీమ‌) బీసీ సదస్సులు పెడతామ‌న్నారు. బ్రాందీ షాపులను 25 ఏళ్ల తనఖా పెట్టి.. రూ. 8700 కోట్లు అప్పు తెస్తారా..? అని నిల‌దీశారు. బ్రాందీ షాపులను తనఖా పెట్టిన దౌర్బాగ్యుడని తెలియక ప్రజలు ఓటేశారని సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు.