కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నోట.. ఎప్పుడూ వినని మాట.. తాజాగా వినిపించింది. ఇప్పటి వరకు బద్ధ శత్రువులుగా చూస్తున్న.. అసలు వారిని మనుషులుగా కూడా పరిగణించని.. ముస్లిం వర్గంపై ప్రధాని మోడీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ.. ముస్లింలకు చేరువ కావాలని.. ఆదిశగా వారిని ఆకర్షించాలని ఆయన చెప్పడం.. నిజంగానే ప్రపంచంలో ఎనిమిదో వింత అనే చెప్పాలి.
ఎందుకంటే.. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా దేశంలోనే పెద్ద రాష్ట్రం యూపీలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా ముస్లింలకు కేటాయించలేదు. ఇక, దేశంలోనూ ఇదే పరిస్థితి. అంతేకాదు.. మోడీ ప్రభుత్వ హయాంలోనే ట్రిపుల్ తలాక్ వంటి వాటిని రద్దు చేశారు. ఇక, త్వరలోనే జనాభా నియంత్రణ కూడా చేపట్టనున్నారు. ఇలాంటి నేపథ్యంలో అనూహ్యంగా మోడీ నోట ముస్లిం మాట రావడం గమనార్హం.
ఇంతకీ మోడీ ఏమన్నారంటే.. ముస్లింలు సహా మైనారిటీలందరికీ చేరువ కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. లోక్‌సభ ఎన్నికలకు సుమారు 400 రోజులే మిగిలి ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. ఓట్లు ఆశించకుండా పాస్మాండా ముస్లింలు, బొహ్రాలు, ముస్లింలలో వృత్తి నిపుణులు, విద్యావంతులను కలుసుకోండి అని క్లాస్ ఇచ్చారు.
అంతేకాదు.. క్రిస్టియన్లకు చెందిన చర్చిలను సందర్శించాలని మోడీ నిర్దేశించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు పాస్మాండా ముస్లింలను కలుసుకుని, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని మోడీ సూచించారు. మరి అనూహ్య మార్పునకు రీజనేంటి? అంటే.. 2024 ఎన్నికల ఎఫెక్టేనని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని భావిస్తున్న మోడీ.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని సైతం పక్కన పెట్టి ముస్లింలను కీలకంగా భావించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.